ప్రజలకు అంతరాయం కలిగిస్తే ఉపేక్షించేదిలేదు : బాపట్ల జిల్లా ఎస్పి వకుల్ జిందాల్
ప్రజాశక్తి - చీరాల
పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాలను బలవంతంగా మూయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. టిడిపి రాష్ట్ర బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన సోమవారం చీరాల పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించినారు. అక్కడ బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సాధారణ జన జీవనం, రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఏపీ పోలీసు 30 యాక్టు అమలులో ఉందన్నారు. జిల్లాలో ఎక్కడా నిరసనలకు, ధర్నాలకు అనుమతి లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 800 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎస్‌బి ఇన్స్పెక్టర్ ఎ శ్రీనివాస్, బాపట్ల పట్టణ ఇన్స్పెక్టర్ యు శ్రీనివాసులు, చీరాల టూ టౌన్ ఇన్స్పెక్టర్ జి సోమశేఖర్ ఉన్నారు.










