Apr 16,2023 21:56

ప్రజాశక్తి - మండవల్లి
             గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి మౌలిక వసతులు ఏర్పాటు చేసి ప్రజలకు అండగా ఉంటామని కైకలూరు ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరావు(డిఎన్‌ఆర్‌) స్పష్టం చేశారు. మండలంలోని ఉనికిలి గ్రామంలో 125వ రోజు ఆదివారం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఆదివారం ఉదయం పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. గ్రామంలో పర్యటించి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా ముందుగుర్తుకు వచ్చేది చింతపల్లి అంకినీడు అని అన్నారు. ఆయన గ్రామాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ గ్రామాభివృద్ధికి వైద్యశాల నిర్మించుకోవడం అనేది ఆయన చిరకాలవాంఛ అని అన్నారు. దీంతో గ్రామంలో రూ.20 లక్షల 80 వేలతో ఆసుపత్రిని నిర్మించామన్నారు. రూ.40 లక్షలతో సచివాలయం నిర్మించి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. గ్రామస్తుల అభీష్టం మేరకు రూ.ఐదు లక్షల నిధులను అందించి శ్మశానానికి కాంపౌండ్‌ వాల్‌ నిర్మించామని, కల్వర్టుల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పారు. అనంతరం వైద్యశాలను, సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మాధు శివరామకృష్ణ, ఎంపిపి పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గాప్రసాద్‌, జెడ్‌పిటిసి సభ్యులు ముంగర విజయనిర్మల, వైస్‌ ఎంపిపి అగస్తి ఆదివిష్ణు, వైసిపి మండల అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, సర్పంచి ఇమిడి మరియమ్మ పాల్గొన్నారు.