May 18,2021 07:28

   కోవిడ్‌ వ్యాక్సిన్‌ లను కనుగొనడానికి జరిపిన పరిశోధనలకు అవసరమైన పెట్టుబడి ప్రైవేటు కంపెనీల నుండి రాలేదు. ఆ పెట్టుబడి అంతా ప్రభుత్వాలు పెట్టినదే. టాక్స్‌ పేయర్ల సొమ్మును ఆ పరిశోధనలకు ఖర్చు చేశారు. ఇండియాలో కనుగొన్న 'కోవ్యాక్సిన్‌' కు భారత ప్రభుత్వం తన బడ్జెట్‌ నుండే ఖర్చు చేసింది. కొత్తగా రంగంలోకి దిగే కంపెనీలకే తమ పెట్టుబడులు తిరిగి రాబట్టుకునే అవకాశం ఉన్నప్పుడు ఇప్పటికే ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు ఆ అవకాశం ఎందుకుండదు? మరి అలా ఉన్నప్పుడు ఇక వేరే పేటెంటు హక్కు ఆ కంపెనీలకే ఎందుకుండాలి ?
    2020 అక్టోబర్‌ 2 నాటికి ప్రపంచంలో ఇంకా కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఏదీ ఆమోదం పొందలేదు. అప్పుడే భారతదేశం, దక్షిణాఫ్రికా రాబోయే వ్యాక్సిన్‌ లకు పేటెంట్‌ చట్టాల నుండి మినహాయింపు ఇవ్వాలని ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యు.టి.ఓ ను కోరాయి. ఆ తర్వాత ఆ డిమాండ్‌ ను దాదాపు 100 కి పైగా దేశాలు బలపరిచాయి. ఈ ఏడాది మే 5న కోవిడ్‌ వ్యాక్సిన్‌ లపై తాత్కాలికంగా పేటెంట్‌ చట్టాల వర్తింపును నిలిపివేయడానికి అంగీకరిస్తూ అమెరికా ఒక ప్రకటన చేసింది. మామూలుగా అమెరికా అందరికన్నా పేటెంటు చట్టాల విషయంలో చాలా గట్టి పట్టు పడుతుంది. కాని ఈ సందర్భంలో కాస్త తన వైఖరిని సడలించుకుంది. డబ్ల్యు.టి.ఓ లో రాతపూర్వకంగా జరిగే చర్చల ఆధారంగానే మినహాయింపులు ఉండాలని అమెరికా అంటోంది.
   ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ ఉత్పత్తిని అర్జెంటుగా విస్తరించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ మినహాయింపు అంశం ముందుకొచ్చింది. పేటెంట్‌ చట్టం అమలు జరిగితే సరుకు ఉత్పత్తిని పరిమితంగా చేసి కృత్రిమంగా కొరత సృష్టించవచ్చు. అప్పుడు ఆ సరుకుకు ఎక్కువ రేటు పలుకుతుంది. అలా ఎక్కువ కాలం కొనసాగించగలిగితే ఆ సరుకు ఉత్పత్తికి సంబంధించి పేటెంటు కలిగివున్న సంస్థ ఎక్కువ లాభాలను పొందగలుగుతుంది. తద్వారా ఆ ఉత్పత్తి కోసం, పరిశోధనల కోసం పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవచ్చు. ఇది పేటెంటు వ్యవస్థను సమర్థించేవారి వాదన. అయితే ఇప్పుడు కోవిడ్‌ వ్యాక్సిన్‌ లకు కొరత కొనసాగితే ప్రపంచం దాని పర్యవసానాలను ఏమాత్రమూ భరించలేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ రోజూ వేలాదిమంది కోవిడ్‌ తో మరణిస్తూ వుంటే కొన్ని సంస్థల లాభాలను కాపాడుకోవడానికి ప్రాధాన్యతనివ్వడం కుదరని పని. అందుకే వ్యాక్సిన్‌ లపై పేటెంటు హక్కులను రద్దు చేయాలి.
ఇప్పుడు వ్యాక్సిన్‌ ల ఉత్పత్తికి తగిన ప్రేరణ ఉంటేనే కదా ప్రపంచానికి కావలసిన వ్యాక్సిన్‌ లను కనుగొనడానికి ఎక్కువ మంది ముందుకొస్తారు? పేటెంటు హక్కు రద్దు చేస్తే ఎవరొస్తారు? అని అడగవచ్చు. ఈ వాదన పూర్తిగా తప్పు. పేటెంటు హక్కు రద్దు చేయాల్సిందే. ఎందుకంటే కోవిడ్‌ వ్యాక్సిన్‌ లను కనుగొనడానికి జరిపిన పరిశోధనలకు అవసరమైన పెట్టుబడి ప్రైవేటు కంపెనీల నుండి రాలేదు. ఆ పెట్టుబడి అంతా ప్రభుత్వాలు పెట్టినదే. టాక్స్‌ పేయర్ల సొమ్మును ఆ పరిశోధనలకు ఖర్చు చేశారు. 'కోవిషీల్డ్‌' వ్యాక్సిన్‌ ను ఆస్ట్రాజెనెకా అనే సంస్థ ఉత్పత్తి చేస్తోంది. దాని పరిశోధనకు పెట్టుబడి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పెట్టింది. ఆ యూనివర్సిటీకి నిధులను బ్రిటిష్‌ ప్రభుత్వం సమకూర్చింది. అమెరికాలో ఉత్పత్తి చేస్తున్న 'మోడర్నా' వ్యాక్సిన్‌ పరిశోధనకు అమెరికన్‌ ప్రభుత్వం అక్కడి టాక్స్‌పేయర్ల సొమ్మునే ఖర్చు చేసింది. ఇక ఇండియాలో కనుగొన్న 'కోవ్యాక్సిన్‌' కు భారత ప్రభుత్వం తన బడ్జెట్‌ నుండే ఖర్చు చేసింది. అందుచేత వ్యాక్సిన్‌ లను కనుగొనడానికి కంపెనీలు ఖర్చు చేసినదేమీ లేదు. అందుచేత ఆ ఖర్చును తిరిగి రాబట్టుకోవడం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు.
   వ్యాక్సిన్‌ ల పరిశోధనకు ప్రైవేటు కంపెనీలు ఏమీ ఖర్చు చేసి వుండకపోవచ్చు. కాని ఆ వ్యాక్సిన్‌ ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన పెట్టుబడి వ్యయం మాటేమిటి ? అన్న ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం తేలికే. ఇప్పటికే ఆ వ్యాక్సిన్‌ ల అమ్మకాల ద్వారా కంపెనీలు తాము పెట్టిన పెట్టుబడులను తిరిగి రాబట్టుకున్నాయి. వాస్తవానికి పెట్టిన పెట్టుబడులకన్నా ఎక్కువే రాబట్టుకున్నాయి. అందుకే తమకే ఆ పేటెంటు హక్కులు ఉండాలని ఆ కంపెనీలు వాదిస్తున్నాయి. పేటెంటు హక్కులు గనుక లేకపోతే అవే వ్యాక్సిన్‌ లను ఉత్పత్తి చేయడానికి ఇంకా ఎక్కువ కంపెనీలు ముందుకొస్తాయి. అంటే పేటెంటు హక్కులు లేకుండానే ఏ కంపెనీ అయినా వ్యాక్సిన్‌ ల ఉత్పత్తికి అయ్యే పెట్టుబడిని తిరిగి రాబట్టుకునే అవకాశం ఉన్నట్టే. లేకపోతే ఆ కంపెనీలు ఎందుకు ముందుకొస్తాయి ? కొత్తగా రంగంలోకి దిగే కంపెనీలకే తమ పెట్టుబడులు తిరిగి రాబట్టుకునే అవకాశం ఉన్నప్పుడు ఇప్పటికే ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు ఆ అవకాశం ఎందుకుండదు? మరి అలా ఉన్నప్పుడు ఇక వేరే పేటెంటు హక్కు ఆ కంపెనీలకే ఎందుకుండాలి ?
   అందుచేత తమకే పేటెంటు హక్కులు ఉండాలని కొన్ని కంపెనీలు చేస్తున్న వాదనలన్నీ పూర్తి అసత్యాలపై ఆధారపడినవే. కొద్దిపాటి బహుళజాతి ఔషధ కంపెనీల విచ్చలవిడి దోపిడీని యథేచ్ఛగా కొనసాగించడం కోసమే ఈ విధంగా వాదనలు చేస్తున్నాయి. ఈ మహమ్మారి కారణంగా తీవ్ర బాధలలో ఉన్న ప్రజానీకపు కష్టాలను ఈ కంపెనీలు సొమ్ము చేసుకుందామనుకుంటున్నాయి. చాలా దేశాల్లో (భారతదేశంలో మాత్రం కాదండోరు!) ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్‌ను ఆయా ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అందుచేత నేరుగా ప్రజల నుండి సొమ్ము కొల్లగొట్టినట్టు కనిపించదు. కాని ఆ సొమ్ము ప్రభుత్వ బడ్జెట్ల నుండి వస్తుంది కదా. అంటే పరోక్షంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టే కదా. పైగా ఈ లాభాలు చాలా మోతాదులో వస్తున్నాయి. ఉదాహరణకు-ఫైజర్‌ కంపెనీ 2021 మొదటి మూడు మాసాల్లోనే 350 కోట్ల డాలర్ల లాభాన్ని సంపాదించింది (అంటే సుమారు రూ.26,250 కోట్లు). ప్రైవేటు కంపెనీలకు ఊరికే లాభాలు తెచ్చిపెట్టడానికి కాకపోయినా, ప్రభుత్వాలు పెట్టిన ఖర్చును తిరిగి రాబట్టుకోడానికైనా పేటెంటు హక్కు ఉండడం అవసరం కదా అని వాదించేవారున్నారు. దీనికి నాలుగు విధాలుగా సమాధానం చెప్పవచ్చు.
   మొదటిది- ప్రైవేటు కంపెనీలకు లాభాలను తెచ్చిపెట్టినట్టు ప్రభుత్వాలకు పేటెంట్లు ఏ లాభాలనూ తెచ్చిపెట్టవు. ప్రజలు చెల్లించిన పన్నుల నుండే ఖర్చు చేశారు గనుక ప్రత్యేకంగా ఆ ప్రజలకు పరిహారం చెల్లించే ప్రసక్తి ఉండదు. నిజానికి పేటెంటు ఉంటే వ్యాక్సిన్‌కు ధర ఎక్కువగా ఉంటుంది. ఆ వ్యాక్సిన్‌ ను కనుగొనడానికి మొదట ఖర్చు చేసిన దేశంలోని ప్రజలకు కూడా ఆ ఎక్కువ ధరకే అమ్ముతారు. పేటెంటు హక్కు కారణంగా చెల్లించే ఎక్కువ ధరను ఇతర దేశాల ప్రజల నుండే గాక స్వంత దేశ ప్రజల నుండి కూడా రాబడతారు. అంటే వ్యాక్సిన్‌ ను కనుక్కున్న దేశ ప్రజలకు కూడా పేటెంటు హక్కు వలన నష్టమే.
   రెండవది- ఈ వ్యాక్సిన్‌ లను కనుగొనడానికి ప్రభుత్వాలు ఎందుకు ఖర్చు చేస్తాయి? తమ దేశ ప్రజలను కాపాడుకోడానికి. పేటెంటు హక్కు లేకపోతే తమ దేశ ప్రజలకు ప్రయోజనం. దానివలన మరో దేశ ప్రజలకు కూడా ప్రయోజనం కలగవచ్చు. భారత దేశంలో కనుగొన్న వ్యాక్సిన్‌ వలన భారతీయులతోబాటు అమెరికన్లకు కూడా ప్రయోజనం కలిగిందనుకోండి. దానివలన పోయేదేముంది? భారతీయుల ప్రాణాలను కాపాడడానికి, అమెరికన్ల ప్రాణాలను కాపాడడానికి మధ్య ఘర్షణ ఏముంది ?
  మూడవది- మన దేశ ప్రజల వరకే మనం చూసుకుందాం, తక్కిన ప్రపంచంతో సంబంధం లేదు అని కరోనా వ్యాక్సిన్‌ ల విషయంలో అనుకోలేం. ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశం విడివిడిగా కరోనా వ్యాప్తిని అరికట్టలేదు. ఇది ప్రపంచమంతటా ఒక్కుమ్మడిగా అరికట్టాల్సిన వ్యాధి. అందుచేత మన దేశంలో కనుగొన్న వ్యాక్సిన్‌ వలన ఇతర దేశాల ప్రజలకు వ్యాక్సిన్‌ తేలికగా అందుతున్నదంటే దానివలన వాళ్ళకేగాక, మనకు కూడా ప్రయోజనమే. దీనిని నష్టంగా భావించలేం.
   నాలుగోది- ఈ విషయం మనకన్నా సంపన్న దేశాల ప్రజలు బాగా అర్ధం చేసుకుంటున్నారు. అమెరికాలో 69 శాతం జనాభా కోవిడ్‌ వ్యాక్సిన్ల మీద ఎటువంటి పేటెంట్లూ ఉండకూడదని భావిస్తున్నారని, కేవలం 27 శాతం మాత్రమే పేటెంట్లకు అనుకూలంగా ఉన్నారని ఒక సర్వే వెల్లడించింది. ప్రజలలో అభిప్రాయం ఈ విధంగా ఉంది గనుకనే బైడెన్‌ తాత్కాలికంగానైనా కోవిడ్‌ వ్యాక్సిన్‌లపై పేటెంటు రద్దు చేయడానికి సుముఖత కనపరిచాడు. అది అతగాడి ఎన్నికల మానిఫెస్టోలో కూడా ఉన్నదనుకోండి. బైడెన్‌ ను ఎన్నికలలో బలపరచిన వామపక్షాలు ఈ విషయం మీద గట్టిగానే ఉన్నాయి. దానికి తోడు ప్రజలలో అత్యధికులు పేటెంట్ల రద్దుకే మొగ్గు చూపడం వలన బైడెన్‌ ఈ విధంగా నిర్ణయించాడు.
   ఈ నిర్ణయాన్ని బహుళజాతి ఔషధ కంపెనీలే గాక తక్కిన సంపన్న దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు పేటెంటు రద్దుకు వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. మరీ ముఖ్యంగా జర్మనీ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ వ్యతిరేకత కారణంగా సమీప భవిష్యత్తులో ఈ పేటెంటు రద్దు కార్యరూపం ధరించకపోవచ్చు. ఇప్పుడిప్పుడే ఇది సాధ్యం కాదు గనుకనే తెలివిగా బైడెన్‌ తాత్కాలిక రద్దును సమర్ధించి వుండవచ్చునని కొందరు విమర్శకులు అంటున్నారు కూడా.
   వాస్తవానికి ప్రధానమైన వ్యాధులకు సంబంధించిన ఏ ఔషధాలపైనా పేటెంట్లు ఉండకూడదు. ఇది కనీస ధర్మం. ఆ సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం కోవిడ్‌ కు సంబంధించిన వ్యాక్సిన్‌ ల విషయంలోనైనా పేటెంట్ల తాత్కాలిక రద్దు వరకూ అమెరికా అంగీకరించడాన్ని స్వాగతించాల్సిందే. అయితే దీనివలన ప్రస్తుతం మనం ఎదుర్కుంటున్న రెండో విడత కోవిడ్‌ దశలో గాని, వస్తుందంటున్న మూడో విడత కోవిడ్‌ దశలో గాని ఎటువంటి ప్రయోజనమూ ఉండదని మనం గమనించాలి. దానివలనే ఏదో ఒరిగిపోతుందని ఆశలు పెట్టుకుని కూచోడం కన్నా కంపల్సరీ లైసెన్సింగ్‌ పద్ధతిని అమలు చేసి ఎక్కువమంది ఉత్పత్తిదారులను రంగంలోకి దించాలి. ఇప్పుడున్న డబ్ల్యు.టి.ఓ నిబంధనలలో కూడా జాతీయంగా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు పేటెంటు నిబంధనల నుండి ఆ దేశం మినహాయింపులు పొందవచ్చునని ఉంది. ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితి అటువంటి జాతీయ అత్యవసర పరిస్థితే. సాధారణంగా ఈ కంపల్సరీ లైసెన్సింగ్‌ విధానాన్ని అమెరికా అంగీకరించదు. కాని ప్రస్తుత పరిస్థితిలో తాత్కాలికంగా పేటెంట్లను రద్దు చేయడానికి ఇప్పటికే అంగీకరించి వున్నందున మన దేశం కంపల్సరీ లైసెన్సింగ్‌ కు పూనుకుంటే అమెరికా అడ్డు చెప్పకపోవచ్చు.
కాని ఈ కంపల్సరీ లైసెన్సింగ్‌ పద్ధతిని అమలు చేయడానికి వ్యతిరేకంగా ఉన్నది మన మోడీ ప్రభుత్వమే. ఇది వింతగా అనిపించవచ్చు. కాని ఇది నిజం. కంపల్సరీ లైసెన్సింగ్‌ కు పోవడం కన్నా దౌత్యపర ప్రయత్నాల ద్వారా సంపన్న దేశాలను ఒప్పించి పేటెంటు చట్టానికి మినహాయింపులు పొందడమే మెరుగైన ప్రత్యామ్నాయం అని మోడీ ప్రభుత్వం అభిప్రాయపడుతున్నది. ఈ దౌత్యపరమైన ప్రయత్నాలు ఫలించి (ఒకవేళ ఫలిస్తే) ఆ మినహాయింపులు వచ్చేసరికి కొన్ని నెలలు గడిచిపోతాయి. ఈలోపు దేశంలో మరణాలు లెక్కకు మించిపోతాయి. 10 లక్షల మరణాలు దాటి సంభవించే ప్రమాదం ఉంది. కాని మోడీ ప్రభుత్వ అమానుష ధోరణికి హద్దేది ?
   ఇతర దేశాలలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్‌ ల విషయంలో కంపల్సరీ లైసెన్సింగ్‌ విధానాన్ని అమలు చేయడం పక్కన బెడితే. మన దేశంలో, మన ప్రభుత్వ పెట్టుబడితో ఉత్పత్తి అయిన కోవ్యాక్సిన్‌కు సైతం కంపల్సరీ లైసెన్సింగ్‌ వర్తింపజేయడానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇప్పటికీ భారత్‌ బయోటెక్‌ దే గుత్తాధిపత్యం. పైగా ఆ కంపెనీ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకోడానికి కూడా రూ.1500 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించింది ఈ ప్రభుత్వం (సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కు కోవిషీల్డ్‌ ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని పెంచడానికి కూడా రూ.3000 కోట్లు ఇచ్చింది. అయినా కోవిషీల్డ్‌ పై సీరం ఇన్‌స్టిట్యూట్‌ దే గుత్తాధిపత్యం). గుత్తపెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడడంలో ఈ ప్రభుత్వం ఎంత లోతు మునిగిపోయిందంటే ఈ దేశ ప్రజలు గత శతాబ్ద కాలంలోకెల్లా అత్యంత ఘోరమైన ఆరోగ్య విపత్తును ఎదుర్కుంటున్నారన్న స్పృహనే అది పూర్తిగా కోల్పోయింది !

(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రభాత్‌ పట్నాయక్‌