Jun 06,2021 13:28

కోవిడ్‌ రెండో అలతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ప్రభుత్వం అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోగా, రాష్ట్రాలకు చేయాల్సిన సాయం చేయకుండా చేతులెత్తేసింది. మరోవైపు రెండో అల ఎదుర్కొనేందుకు నివేదికలొచ్చినా ఎన్నికల్లో, కుంభమేళాల్లో మునిగితేలింది.. దేశంలో అనేకమంది బతకగలిగినా బతకలేని ఆరోగ్యవ్యవస్థ దుస్థితి. వైద్యరంగం కార్పొరేట్‌ల కబంధ హస్తాల్లో ఉండటం సామాన్యులే కాదు.. మధ్యతరగతీ అందుకోలేని దయనీయ స్థితి. ఆఖరుకు చనిపోతే కాల్చడానికి, పూడ్చడానికి కాసింత స్థలమూ లేని దారుణ స్థితి. ఈ పరిస్థితుల్లో ఇంత హడావిడిగా కొత్త పార్లమెంటు భవనం నిర్మాణానికి పూనుకోవడం ఎందుకు? ఆఘమేఘాల మీద సెంట్రల్‌ విస్టా డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును అమలు వెనుక అసలు అజెండా ఏమిటి? ఈ నిర్మాణంలో జాతీయోద్యమ చిహ్నాలు విధ్వంసం అవ్వబోతున్నాయా? 2022లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఈ కీర్తిచిహ్నాల ప్రదర్శనకా ఈ వెంపర్లాట? అసలు స్వాతంత్య్రపోరాట త్యాగధనుల చరిత్రను తెరమరుగు చేయాలనే కుట్రా..? వీటన్నింటిపైనే ఈ ప్రత్యేక కథనం..

india hospital


 

                                                              ఢిల్లీ హైకోర్టు తీర్పు

    సెంట్రల్‌ విస్టా డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు అంటే పార్లమెంట్‌, దాని చుట్టూ వున్న ప్రాంత అభివృద్ధి పథకం అనవచ్చు. దీనిని 20 వేల కోట్ల రూపాయల ఖర్చుతో హడావుడిగా కేంద్ర బిజెపి సర్కార్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణాలు 2022 75వ స్వాతంత్ర దినోత్సవం నాటికి పూర్తి చేయాలన్నది వారి ఆలోచన. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ రాజధాని ఆక్సిజన్‌, మందులు, వ్యాక్సిన్‌లు, పడకలు, వెంటిలేటర్లు చివరికి చనిపోయిన వారిని పాతటానికి స్థలం కూడా లేక అతలాకుతలం అవుతోంది. ఈ క్రమంలో అన్యామల్హోత్రా, సోహైల్‌ హష్మిి అనే ఇద్దరు ప్రముఖులు ఈ ప్రాజెక్టు పనులు ఆపాలని ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ప్రత్యేకించి కరోనా సమయంలో పెద్దఎత్తున సాగుతున్న ఈ నిర్మాణ పనులు ఢిల్లీ ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలుగజేేస్తాయని అందులో వారు పేర్కొన్నారు. పనులు జరుగుతున్న స్థలంలో వేలాదిమంది కార్మికుల దయనీయ పరిస్థితులను తెలిపారు. రోజుకు 12 గంటల శ్రమని, రోజుల తరబడి వేతన బకాయిలని కేసులో పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు ఈ నెల (జూన్‌) ఒకటవ తేదీన వారిని తీవ్రంగా మందలించింది. అంతేకాకుండా లక్ష రూపాయలు జరిమానా విధించింది. ''ఇది చాలా ముఖ్యమైన పని, దీన్ని ఎట్టి పరిస్థితులలోను ఆపకూడదు'' అంటూ ఓ దురదృష్టకరమైన తీర్పు ఇచ్చింది.

                                                                  సంస్కృతి విధ్వంసం

 సంస్కృతి విధ్వంసం

    ఆలీఘర్‌ ముస్లిం యూనివర్శిటీ చరిత్రకారుడు ఎ ఎన్‌ రెజ్వి 'ఇది సౌందర్య శాస్త్రానికి సంబంధించిన విషయం కాదు. ఇది చరిత్రకు సంబంధించిన సమస్య. బ్రిటీషు వాళ్లే ఆనాడు విస్తృతంగా సంప్రదింపులు జరిపి, నిర్మాణం ఏ ఇంజనీర్‌కి అప్పజెప్పాలని వెతుకులాడారు. కానీ ఇప్పుడు అటువంటిదేమీ లేదు. పారదర్శకతే అసలే లేదు. ఆ ప్రాంతంలోని ఫుట్‌పాత్‌ పగలగొట్టినా అది మన జాతి వారసత్వంపై దాడిగానే చూడాలి' అని సరిగ్గా చెప్పారు. పై మూడు ప్రభుత్వ శాఖలలో మన దేశ చారిత్రక గమనాన్ని తెలియజేసే ఎంతో విలువైన అతి పురాతన వస్తువులు, పరికరాలు, పత్రాలు భద్రపరచబడి ఉన్నాయి. మనదేశ బహుళ సంస్కృతికి అవి ఎంతో విలువైన నిదర్శనాలు. గౌతమ బుద్ధుని అస్థికలు, మొహంజోదారో, హరప్పా కాలంనాటి రాతి వస్తువులు, చోళుల నాటి అనేక టన్నుల బరువైన విగ్రహాలు, వేల సంవత్సరాల నుండి మనదేశంలో వాడబడిన బంగారు, వెండి నాణెలు, నిజాం నవాబు కాలంనాటి ఆభరణాలు, ఇవికాక నాడు రాళ్లపై చెక్కిన అనేక బొమ్మలు, ఆనాటి తాళపత్ర గ్రంథాలు వంటి 2,06,000కి పైగా విలువైన వస్తువులు ఉన్నాయి. నాడు ఈ భవన సముదాయాన్ని నిర్మించిన ఆంగ్లేయులు కూడా మన దేశంలోని బహుళ సంస్కృతిని ప్రతిబింబించేలా మొఘల్‌ తరహా ఉద్యానవనాలు, రాజపుట్‌ శిల్పకళకు సంబంధించిన దర్వాజాలు, కిటికీలు, గొడుగు వంటి పైకప్పులతో నిర్మించారు. ఇవన్నీ హిందూత్వ శక్తులు నమ్మబలుకుతున్న పుక్కిటి పురాణాలకు విరుద్ధంగా బహుళ జాతుల, అనేక మత సాంప్రదాయాల సంగమంగా భారతదేశాన్ని నిరూపిస్తున్న సాక్ష్యాలు. వీటన్నింటినీ చెక్కు చెదరకుండా రానున్న తరాలకి అందించాలి. మన పురాతన చరిత్ర గురించి అర్థం చేసుకోవడానికి అవసరమైన ఇంత విలువైన వాటిని మార్చడం, అదీ ఇంత భయంకరమైన కరోనా కష్టకాలంలో హడావుడిగా మార్చడం వలన చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంది. అయినా ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళుతోంది. అందుకే అనేకమంది దేశభక్తియుత మేధావులు, లౌకిక శాస్త్రవేత్తలు, కళాకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

national musium


 

                                                                   అసలు ఎజెండా...

అసలు ఎజెండా...

   పాకిస్తాన్‌ 1947 ఆగష్టు 15న ఒక మత రాజ్యంగా ఏర్పడింది. భారతదేశం ఒక హిందూ రాజ్యంగా ప్రకటించబడాలని నాటి ఆర్‌ఎస్‌ఎస్‌ బహిరంగంగానే కోరింది. ఆ వాదనని కాంగ్రెస్‌, కమ్యూనిస్టులే కాదు, యావత్‌ భారతదేశం తిరస్కరించింది. భారతదేశం లౌకిక రాజ్యంగా ఉండాలని, అప్పుడే అభివృద్ధి, ఆధునికత, సాంఘిక సమానత్వం సాధ్యమని ప్రజలు బలంగా నమ్మారు. అయితే నాటి నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రం ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడానికి పన్నాగాలు పన్నుతూనే ఉంది. అందులో భాగమే మన లౌకిక రాజ్యాంగాన్ని రద్దు చేసి, దాని స్థానంలో అతి క్రూరమైన మనుధర్మ శాస్త్రాన్ని ప్రతిష్టించడం. అందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ రూపొందించిన మేధావుల సంస్థ ''సంస్కార భారత్‌''కు మనుధర్మ శాస్త్రాన్ని ప్రజలందరూ ఆమోదించేలా చాకచక్యంగా తిరగరాసే ప్రాజెక్టును అప్పగించింది. వాస్తవానికి మనుధర్మ శాస్త్రం ప్రస్తావన లేదు కాబట్టి భారత రాజ్యాంగాన్ని తాము ఆమోదించబోమని 1950లోనే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించింది. 2014లో అంతకుమించి 2019లో పార్లమెంటులో అత్యధిక సీట్లు సాధించిన హిందూత్వ శక్తులు, 1947 నాటి కలలను సాకారం చేసుకోవడానికి ఆరాటపడుతున్నాయి. భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి, దానికి మూలస్థంభాలైన లౌకిక వ్యవస్థ, ఫెడరల్‌ వ్యవస్థ, సామాజిక న్యాయాలపై ముప్పేట దాడి మొదలు పెట్టారు. ఇప్పుడు భారత రాజ్యాంగాన్నే కాదు ఆ రాజ్యాంగం ఆమోదించబడిన పార్లమెంటు భవనాన్ని కూడా కనుమరుగుచేసే కుట్ర ప్రారంభమైంది. పార్లమెంటు భవనానికి దగ్గరలో వున్న నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఇండియా, ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌, జాతీయ పురావస్తు శాఖ భవనాలను కూలగొట్టి.. వాటి స్థానంలో మంత్రుల క్వార్టర్లు, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి భవనాలు వగైరా నిర్మించనున్నారు. విమర్శలు వెల్లువెత్తిన దగ్గర్నుండి అక్కడ జరుగుతున్న నిర్మాణ కార్యకలాపాల ఫొటోలను తీయడాన్నీ నిషేధిస్తున్నారు. అసలు ఈ మొత్తాన్ని అత్యవసర సర్వీసుల కింద పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

                                                                  మేధావుల లేఖ

మేధావుల లేఖ

     కేంద్ర గృహ నిర్మాణం, అర్బన్‌ అఫైర్స్‌ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న వారిపై విరుచుకుపడ్డారు. ఇప్పటికే 76 మంది ప్రముఖ మేధావులు, కళాకారులు, రచయితలు, మ్యూజియం నిర్వాహకులు ఈ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా లేఖ రాశారు. వారిని కూడా మంత్రి.. 'వీరి వాదన మన దేశానికే తలవంపులు తెస్తుంది. వారి వాదనలో కుటిలత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి' అని హెచ్చరికలాంటి ప్రకటన చేశారు. ఏది ఏమైనా కేంద్ర బిజెపి ప్రభుత్వం కోరుకుంటున్నట్లుగా ఈ ఏడాది ఆఖరికి ఈ ప్రాజెక్టు పూర్తికావచ్చు. 1921లో పార్లమెంటు, రాష్ట్రపతి భవన్‌, తదితర భవనాలు కట్టబడ్డాయి. అంటే ఈ 2021 నాటికి ఆ భవనాల వయస్సు నూరేళ్లు. అందువలన ఈ భవనాలను మారుస్తామని అంటున్నారు. రాబోయే కొద్ది సంవత్సరాలలో పార్లమెంటు సభ్యుల సంఖ్యా పెరగవచ్చని, అప్పటికి ఈ పార్లమెంటు భవనం సరిపోదని బిజెపి అధినేతలు వక్కాణిస్తున్నారు. పైకి చూడటానికి ఇదంతా చాలా సహజంగా జరిగే ప్రక్రియలా కన్పిస్తోంది. కానీ గత ఏడేళ్లుగా అంటే హిందూత్వశక్తులు కేంద్రంలో అధికారం చేపట్టిన దగ్గర నుండి దేశంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యం పరిశీలించాలి. అప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో బిజెపి పైకి చెబుతున్నది నిజం కాదని, దీనిలో ఓ ఫాసిస్టు ఎజెండా అంతర్లీనంగా ఉన్నదని చెప్పొచ్చు.
 

                                                          ముస్సోలినీ, హిట్లర్‌ వారసులు..

ముస్సోలినీ, హిట్లర్‌ వారసులు..

   ముస్సోలినీ, హిట్లర్‌ని, వారి ఫాసిస్టు సిద్ధాంతాన్ని ప్రశంసిస్తూ 1925లో ఆర్‌ఎస్‌ఎస్‌ పుట్టింది. జర్మన్‌లో హిట్లర్‌ ఆర్యజాతి రక్త పవిత్రతను కాపాడటానికి ఇతర జాతుల్ని ఏ రకంగా భౌతికంగా నిర్మూలించాడో అది మనకు ఆదర్శం కావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ రెండవ సర్‌సంఫ్‌ుచాలక్‌ ఎంఎస్‌ గోల్వాల్కర్‌ ప్రకటించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పడిన వెంటనే వ్యవస్థాపకులలో ఒకరైన బిఎస్‌ మూంజేను ఇటలీ ఫాసిస్టు అధినేత ముస్సోలినీ వద్దకు, వాళ్లు ప్రారంభించిన ఫాసిస్టు ప్రైవేటు సైన్యం గురించి అధ్యయనం చేయడానికి పంపారు. అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్ర, అది ముందుకు తెచ్చిన హిందూత్వ సిద్ధాంతం యొక్క సారాంశం తెలుసుకుంటే ఈ రోజు మోడీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ 'విస్టా డెవలప్‌మెంటు ప్రాజెక్టు' అసలు ఉద్దేశం అర్థమవుతుంది. వాస్తవానికి ముస్సోలినీ, ఆ తరువాత హిట్లర్‌లు తమ పాలనాకాలంలో ఫాసిస్టు సిద్ధాంతం ప్రజలపై పట్టు సాధించడానికీ, భవనాల నిర్మాణానికీ వాడుకోవాలని నిర్దేశించారు. హిట్లర్‌ ''పాత చరిత్రకి సంబంధించిన అభిప్రాయాలను సూచించే కట్టడాలు అనవసరం. వాటి స్థానంలో నూతన భవన నిర్మాణం జరగాలి. ఆ నిర్మాణం నిరాడంబరత, ఏకాకృతి, జ్ఞాపక చిహ్నాలు, ధృఢమైన మరియు శాశ్వతమైనవిగా ప్రజలు గుర్తించేలా ఉండాలి'' అని ప్రకటించాడు. అంతేకాదు 1933లో అధికారం చేపట్టిన అనంతరం దేశరాజధాని బెర్లిన్‌ని ఆ విధంగా పునర్నిర్మించాలని కోరుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభించే ముందు తనకు అత్యంత ఆప్తుడైన 'ఆల్బర్ట్‌ స్పీర్‌' అనే నాజీ ఆర్కిటెక్ట్‌కి ఆ పని అప్పగించాడు. రెండవ ప్రపంచ యుద్ధాన్ని జర్మనీ గెలవబోతున్నదని, 1951 కల్లా పై పద్ధతులలో బెర్లిన్‌లో 'ప్రపంచ రాజధాని' నిర్మాణం పూర్తికావాలని ఆదేశించాడు. అందుకు 12,000 మెట్రిక్‌ టన్నుల బరువైన ఒక విజయస్థూపాన్ని నాజీ ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే ఆ నరరూప రాక్షసుని ఆశలు ధ్వంసం చేస్తూ సోవియట్‌ రష్యా ఎర్రసైన్యం హిట్లర్‌ సైన్యాన్ని, దాన్ని నమ్ముకున్న జపాన్‌, ఇటలీ సైన్యాలని తుదముట్టించింది. జర్మనీ ఓటమి, హిట్లర్‌ ఆత్మహత్యలతో 'ప్రపంచ రాజధాని' నిర్మాణం అర్ధాంతరంగానే ఆగిపోయింది. ఇప్పుడు ఇండియాలో ఆర్‌ఎస్‌ఎస్‌ హిట్లర్‌ కథను పునరావృతం చేస్తుందా అనిపిస్తుంది.

                                                             నాజీ తరహా చిహ్నాలు..

   'కొత్త పార్లమెంటు భవనం త్రిభుజాకారంతో ఉంటుందట!' అని ప్రముఖ చరిత్రకారిణి నారాయణి గుప్తా అంటూ.. ''ఇప్పటివరకు తెలుస్తున్న సమాచారాన్ని బట్టి వీళ్లు కట్టబోతున్న భవనాలు నాజీ తరహావి. వ్యక్తిగతంగా వాటి చిత్రాలేవీ మనకు తెలియకున్నా ఇక ఏ చిహ్నాలను ఎక్కడ పెడతారన్నది వేచిచూడాల్సిందే' అని పేర్కొన్నారు. ఇప్పుడు వాళ్లు ధ్వంసం చేస్తున్న ప్రాంతంలో మాజీ రాష్ట్రపతి ఫక్రుద్ధీన్‌ ఆలీ అహ్మద్‌ సమాధి, ఢిల్లీ నగరం నిర్మించినప్పటి మశీదు కూడా ఉన్నాయి. పాపం వేతనాల కోసం తవ్వుతున్న కార్మికులకు ఈ విషయాలు అర్థమవుతాయో లేదో. గౌతం భాటియా అనే ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ఈ విషయాలు వివరిస్తూ 'ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ఏ చారిత్రక భవనాలను ఉంచాలి, వేటిని కూల్చాలి అని ఏకపక్షంగా నిర్ణయించకూడదు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు నిర్ణయించే హక్కు, పిల్లలను సాకే మనిషికి ఇవ్వరు. అంటే నిర్ణయాలు ప్రజలు చేయాలి. పార్లమెంటులో చర్చించబడాలి' అని ప్రకటించారు. అలాగే ప్రముఖ ఫొటోగ్రాఫర్‌, సామాజిక కార్యకర్త అయిన రామ్‌రహిమాన్‌ 'మోడీగారి అద్భుత ప్రాజెక్టులన్నీ మౌలికంగా ఫాసిస్టు తరహావి. సబర్మతి నదిలో పారుదల లేని టాంక్‌ కట్టడం, బెనారస్‌లో కాశీ విశ్వనాథుని మందిరం చుట్టూ ఇళ్లన్నింటినీ తొలగించడం... ఇలా ఏ చట్టమూ లెక్కచేయకుండా, ప్రజాభిప్రాయాలు సేకరించకుండా, భౌతికంగా ప్రజల్ని, భవనాలను నిర్మూలిస్తూ పోవడం మన దేశంలో పరిపాటి అయింది. నేడు ఈ ఫాసిస్టు మూక సృష్టిస్తున్న ప్రజా కళలు, ఆర్కిటెక్చర్స్‌ పూర్తిగా ప్రజావ్యతిరేకమైనవి. సుసంపన్నమైన భారత సంస్కృతిని విధ్వంసం చేసే చర్యలివి' అని ఆయన హిందూ పత్రికలో రాసిన ఒక వ్యాసంలో వ్యక్తపరిచారు.

chihnalu

                                                 

                                                    ప్రతీఘాత సాంస్కృతిక దాడిని తిప్పికొట్టాలి..

   ఫాసిస్టు తరహా హిందూత్వ సిద్ధాంతానికి ఆయువుపట్టు దాని ప్రతీఘాత సాంస్కృతిక దాడిలో ఉంది. ఇప్పటికే ఇది చేయగలిగినంత నష్టాన్ని చేసింది. భారతీయ సంస్కృతిని, నాగరికతని హిందూ సంస్కృతి, నాగరికతలుగా నమ్మించడానికి కాషాయకూటమి పడరానిపాట్లు పడుతున్నది. ఆహార పద్ధతుల నుండి, వస్త్రధారణ, మాట్లాడే భాష, ఆచార వ్యవహారాలు, పాఠ్యాంశాల్లో మార్పులు..రుద్దుతున్నది. ఇలా అన్నింటా బహుళత్వాన్ని చిదిమి, దాని స్థానంలో ఏకీకృతమైన, హిందూ సంస్కృతి అనేదాన్ని ముందుకు తెస్తున్నది. అందులో భాగంగానే అనేక చారిత్రక కట్టడాలను తుడిచిపెడుతున్నది. కొన్ని కోర్టు తీర్పులూ ఇందుకనుకూలంగా ఉండటం మరో ప్రమాదకర పరిణామం. ఆధునికతత్వం, అభివృద్ధి, సమానత్వం అనే లక్ష్యాలన్నీ ఈ దాడికి గురౌతున్నాయి. స్వాతంత్రోద్యమంలో పాల్గొనకుండా దూరంగా ఉండడమే కాకుండా, ఇప్పుడు ఆ ఉద్యమ స్ఫూర్తి భావితరాల వారికి తెలియకుండా కప్పిపెట్టే కుట్రే చేస్తున్నది హిందూత్వ కూటమి.
    తాలిబన్‌ తరహా రాజ్యస్థాపన వైపు ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూత్వ శక్తులు అర్రులు చాస్తున్నాయి. వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులు ఈ దాడిని ప్రతిఘటించాలి. మన దేశంలో తరతరాలుగా వెల్లివిరుస్తున్న బహుళ సంస్కృతిని, మత సామరస్యాన్ని మరింత అభివృద్ధి చేయాలి. ఈ క్రమంలో హిందూత్వ సిద్ధాంతానికి, హైందవ సంస్కృతికి వెన్నెముక వంటి కుల వ్యవస్థను ధ్వంసం చేయాలి. కులాధిపత్య సంస్కృతికి వ్యతిరేకంగా జరిగిన సంఘ సంస్కరణోద్యమాలను శ్రామిక వర్గ దృష్టితో మరింత సుసంపన్నం చేసి కొనసాగించాలి.

   పాత వాటి స్థానే కొత్తగా నిర్మించడమే కావచ్చు.. కానీ అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయ చరిత్రకారుడు ఆలీ నదీమ్‌ రెజ్వీ చెప్పినట్లు.. ''దీనిపై ఏమి ప్రయోజనం సాధిస్తామో మనకు తెలియదుగానీ.. చరిత్రను శాశ్వతంగా కోల్పోతాం.. రాజ్‌పథ్‌లో బుల్డోజర్లు అదేపనిగా తిరుగుతున్నాయి. ఇది ఒక శాశ్వత విధ్వంసం.''

r.raghu

ఆర్‌. రఘు
సిపిఎం రాష్ట్రకమిటీ సభ్యులు
94900 98422