Apr 06,2023 21:49

'ఫ్యామిలీ డాక్టర్‌', 104 సేవల ప్రారంభోత్సవంలో కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌
ప్రజాశక్తి - ఏలూరు

        రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేరువలో ఆధునిక వైద్యసేవలను ఉచితంగా అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ కోరారు. సిఎం జగన్‌ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుట్ల గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ఏలూరు పట్టణంలోని శనివారపుపేటలోని వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ వద్ద గురువారం ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాంను, 104 వాహనాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ మంచి ఆధునిక వైద్యం అందించేందుకు గ్రామంలోనే వైద్యసేవలు అందించే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రతీ మండలానికి రెండు పిహెచ్‌సిలు, ఇద్దరు వైద్యులు ఒక 104 వాహనంతో అనుసంధానం చేసి ప్రతీరోజు వారికి కేటాయించిన గ్రామాల్లోని వైఎస్‌ఆర్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వైద్య సేవలందిస్తారని తెలిపారు. వారికి కేటాయించిన గ్రామాల్లో నెలలలో కనీసం రెండుసార్లు సందర్శించి ప్రజలకు వైద్య సేవలందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి 44 మొబైల్‌ మెడికల్‌ యూనిట్లను (104 సేవలు) వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఫ్యామిలీ డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌లోని సిహెచ్‌ఒ, ఎఎన్‌ఎంలు ఆశా వర్కర్ల సహకారంతో వైద్య సేవలందిస్తారన్నారు. ప్రతి డాక్టర్‌ హెల్త్‌ క్లినిక్‌లో 16 రకాల టెస్టులు 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. తొలుత హెల్త్‌క్లినిక్‌లో ఉంచిన మందులు, పేషంట్‌ రూములు, వైద్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముద్రించిన పోస్టర్లను కలెక్టర్‌ పరిశీలించారు.
అనంతరం 104 సేవల వాహనాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. వాహనంలో అమర్చిన వైద్యపరికరాలను పరిశీలించి స్వయంగా డాక్టర్లతో బిపి పరీక్ష చేయించుకున్నారు. 104 వాహనం ద్వారా స్థానిక విఎంపి.కాంతమ్మ(83) ఇంటికి వెళ్లి వైద్యసేవలందించారు. ఆమె అనారోగ్య పరిస్థితులపై కలెక్టర్‌ ఆరా తీశారు. డాక్టర్లతో ఆమెకు పరీక్షలు చేయించారు. ఈ కార్యక్రమానికి ముందు సిఎం జగన్‌ ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించి ప్రసంగిస్తున్న దృశ్యాలను టీవీ ద్వారా ప్రజలు వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎపి మెడికల్‌ బోర్డు కౌన్సిల్‌ సభ్యులు డాక్టర్‌ దిరిసాల ప్రసాద్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఆశ, డిఐఒ నాగేశ్వర రావు, డాక్టర్లు మంజూష, జోషి రారు, పూర్ణచంద్ర, 104 వాహన జిల్లా కోఆర్డినేటర్‌ గణేష్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎస్‌.వెంకటకృష్ణ, 104 వాహన సిబ్బంది, సిహెచ్‌ఒలు, ఆశాలు, ఎఎన్‌ఎంలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.