Sep 09,2023 23:58

ప్రజాశక్తి -రేపల్లె 
ప్రజల సొమ్ము కాజేసిన కేసులోనే చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేశార‌ని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టులో అసలు విషయం పక్కకు వెళ్లేలా టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని ఆయ‌న‌ మండిపడ్డారు. అరెస్ట్‌లో ఎలాంటి దురుద్దేశాలు లేవని అన్నారు. బలమైన ఆధారాలతోనే సిట్ వేశామని తెలిపారు. సీఎం జ‌గ‌న్ ప్రభుత్వం ఎంతో సంయమనంతో ఉందని అన్నారు. దర్యాప్తు సంస్థలు ఎంతో స్వేచ్చగా దర్యాప్తు చేస్తున్నాయన్నారు. దేశంలో అత్యంత హేయమైనది ఆర్ధిక నేరమని పేర్కొన్నారు. స్కీమ్‌ పేరుతో స్కామ్‌ చేశారని ఆయ‌న విమర్శించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో అరెస్టు అయ్యాక రాజకీయ దురుద్దేశాలతోనే తనను అరెస్టు చేశారంటూ వ్యాఖ్యానించడం, ఎఫ్‌ఐఆర్‌ లేదు, నోటీసులు లేవని, టీడీపీ లేనిపోని ఆరోపణలు చేస్తోన్నారని, అన్నీ తెలిసే రెండు మూడు రోజుల నుంచి అరెస్టు గురించి ఆయన మాట్లడుతున్నారని మోపిదేవి గుర్తుచేశారు. 2014-2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పుడు కంపెనీలు సృష్టించి ప్రజాధనాన్ని అవినీతి అక్రమాల ద్వారా తన ఖాతాలకు జమ చేసుకున్నారని వివరించారు. రాజధాని నిర్మాణం పేరుతో కొన్ని సూట్ కేస్ కంపెనీలను సృష్టించి కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. షాపూజి పల్లంజీ, ఎల్ అండ్ టి కంపెనీల ద్వారా రూ.118కోట్లు తన ఖాతాల్లోకి మళ్లించుకున్నారని అన్నారు. కేంద్ర విచారణ సంస్థ చేపట్టిన దర్యాప్తులో వెల్లడైదన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఐటీ విభాగం కేసు నమోదు చేసిందన్నారు. 2015లో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో సీమెన్ సంస్థ ద్వారా తప్పుడు ఒప్పందాలు కుదుర్చుకొని రూ. 371కోట్ల నిధులను తన ఖాతాల్లోనికి మళ్ళించుకున్నారని చెప్పారు. చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామికమని రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్న టిడిపి నాయకులకు ప్రజాధనం దారి మళ్ళితే పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఐటీ కేంద్ర ప్రభుత్వ సంస్థని, రాష్ట్ర ప్రభుత్వానికి చెందింది కాదని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించిన కేసులు ఆయనపై ఉన్నాయని గుర్తుచేశారు. ప్రతిసారి హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం తప్ప విచారణ సంస్థలను నిజాయితీగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ప్రజాధనాన్ని అవినీతి, అక్రమ పద్ధతుల ద్వారా లూటీ చేసిన చంద్రబాబుకు పాపం పండిందని తెలిపారు. ఇప్పటికైనా టిడిపి నాయకులు వాస్తవాలను గుర్తించాలని హితవు పలికారు. కార్యక్రమంలో బుడా చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.