Oct 12,2023 22:47

 సిపిఎం ప్రజా రక్షణ భేరి ప్రచారయాత్రలో జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు
ప్రజాశక్తి-హనుమాన్‌జంక్షన్‌:
బిజెపి ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ సాగుతున్న సిపిఎం ప్రజా రక్షణ భేరి ప్రచార యాత్రలు గురువారం కష్ణాజిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి వై నరసింహారావు, మండల కార్యదర్శి బేతా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రెండవ రోజు బాపులపాడు మండలలో కొనసాగింది. గురువారం ఉదయం బిజెపి విధానాలు సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపాయో తెలియజేస్తూ, ఉద్యోగ, కార్మికులకు జరుగుతున్న నష్టాలను ప్రజలకు వివరిస్తూ యాత్ర హనుమాన్‌ జంక్షన్‌ నుండి ఇందిరానగర్‌, పెరికిడు, ఎస్‌ఎన్‌ పాలెం, కే సీతారాంపురం, కానుమోలు, దంటగుంట్ల, కాకులపాడు, అప్పారావుపేట మీదుగా ఆరుగొలను,బండారు గూడెం,ఏ సీతారాంపురం నుండి తిప్పనగుంట సిరివాడ, వరకు కొనసాగింది. అనంతరం ఆరుగొలను ,సిరివాడ గ్రామాలలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కష్ణాజిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి వై నరసింహారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలపై భారాలు మోపి ఆర్థిక అసమానతలు పెంచుతున్నాయని విమర్శించారు. మతోన్మాదంతో ప్రజల మధ్య ఐక్యతను బిజెపి దెబ్బతీస్తోందన్నారు.ప్రజల సొమ్మును కార్పొరేట్లకు రాయితీల రూపంలో ధారదత్తం చేస్తున్నారన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు ఆకాశాన్నంటినా కనీసం పట్టించుకోవడంలేదని వాపో యారు. జిఎస్‌టి పేరుతో ప్రజలపై దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. బిజెపి నీతిమాలిన చర్యలకు రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన మద్దతు ఇవ్వడం దారుణమన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అరాచక పాలనను ప్రజలకు తెలియ జేయాలని ఉద్దేశంతో ఈ యాత్ర చేయడం జరుగుతుందన్నారు .దేశాన్ని బిజెపి, నుండి రక్షించుకో వాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సిపిఎం మండల కార్యదర్శి బేతా శ్రీనివాసరావు అన్నారు. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ సాగుతున్న సిపిఎం ప్రజారాక్షణ బేరి ప్రచార యాత్రలు శుక్రవారంతో బాపులపాడు మండలంలో ముగిసిందని శనివారం నుంచి ఉంగుటూరు మండలంలో కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లం వెంకటేశ్వరరావు, టీవీ లక్ష్మణ స్వామి, బాపులపాడు మండల సిపిఎం నాయకులు ఆంజనేయులు, కోరం రవి కోరం ప్రభాకర్‌ అబ్దుల్‌ బారి ఇతర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.