
రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి వెంకట శ్రీనివాసరాజు
ప్రజాశక్తి - కాళ్ల
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి వెంకట శ్రీనివాసరాజు (వాసు) అన్నారు. జక్కరం, కాళ్ల గ్రామ సచివాలయ పరిధిలో 'వై నీడ్స్ ఎపి జగన్' కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. 2019 జూన్ నుంచి 2023 జూన్ వరకూ చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, జగనన్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను జక్కరం సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి వెంకట శ్రీనివాసరాజు (వాసు) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గంలో పివిఎల్ నరసింహరాజును ఎంఎల్‌ఎగా గెలిపించాలని కోరారు. ఆయన పార్టీ అభివృద్ధికి, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. కాళ్ల గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల శిలాఫలకాన్ని డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన ఓ వైపు, కరోనా మహమ్మారి మరోవైపు వెరసి ఆర్థిక లోటు నేపథ్యంలోనూ జగన్మోహన్‌రెడ్డి అత్యంత సమర్థవంతంగా ప్రజారంజక పాలన సాగిస్తున్నారన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పి.శిరీష విశ్వనాథరాజు, ఉప సర్పంచి కూచంపూడి లక్ష్మీపతిరాజు, జిల్లా సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు కొలుకులూరి ధర్మరాజు, వైసిపి మండల కన్వీనర్ గణేశ్న రాంబాబు, కోపల్లె సొసైటీ అధ్యక్షులు వేగేశ్న జయరామ కృష్ణంరాజు, ఎం.అశోక్, పి.రామారావు, అధికారులు పాల్గొన్నారు.