గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో ప్రజల శక్తి ప్రదర్శితమవడాన్ని మనం చూశాం. బిజెపి పాలకులకు దీన్ని చూసి భయం వేసింది. ఇక రాబోయే రోజుల్లో శాంతియుత ఆందోళనలకు ఆటంకం కలిగించేందుకు, రైతు సంఘాలకు అప్రతిష్టను ఆపాదించేందుకు ప్రయత్నాలు మరింత పెరుగుతాయి. ఇటువంటి ప్రయత్నాలను రైతు సంఘాలు సమైక్యంగా తిప్పికొట్టాలి.
ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన కిసాన్ ట్రాక్టర్ పరేడ్ గుర్తుంచుకోదగిన, విశిష్టమైన ప్రజా కార్యాచరణ. దేశ రాజధానిలో ఇంతవరకు ఎన్నడూ కూడా ఇంతటి అసాధారణ స్థాయిలో నిరసన జరగలేదు. లక్షకి పైగా ట్రాక్టర్లతో, అంతకు మించిన సంఖ్యలో ప్రజలు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. గతంలో బహుశా చాలా పెద్ద ర్యాలీలు జరిగివుండవచ్చు, కానీ ఇంతటి విస్తృతమైన ప్రజా కార్యాచరణ ఎన్నడూ జరగలేదు. పరేడ్‌లో నిర్దేశిత మూడు మార్గాల పొడవునా, భారీ సంఖ్యలో ట్రాక్టర్లు, ఆందోళనకారులు పాల్గొన్నారు. సింఘు, టిక్రి, ఘజిపూర్ సరిహద్దుల నుండి ఈ మార్చ్ ప్రారంభమైంది. అయితే, కొంతమంది తప్పుదారి పట్టిన శక్తులు ఈ రూట్‌ల నుండి పక్కకు మళ్ళి రింగ్ రోడ్ నుండి ఎర్రకోట వరకు వెళ్లాయి. అక్కడ ఖల్సా పతాకాన్ని ఎగురవేయడం కచ్చితంగా రెచ్చగొట్టే చర్య. రింగ్ రోడ్‌కు వెళ్ళాలంటూ పిలుపిచ్చిన 'కిసాన్ మజ్దూర్ సంఘర్ష సమితి' సంస్థ...'సంయుక్త కిసాన్ మోర్చా'లో భాగం కాదు. ఇంతటి స్థాయిలో ప్రజా సమీకరణ, శాంతియుత నిరసనలు ప్రాముఖ్యతను కేవలం కొన్ని తప్పుదారి పట్టిన శక్తులు చేసిన చర్యలతో అణగదొక్కడం సాధ్యం కాదు. బిజెపి, వారి అనుకూల కార్పొరేట్ మీడియా, కొంతమంది ప్రతిపక్ష రాజకీయ నేతలు ఎర్రకోటపై జెండా ఎగురవేయడాన్ని ఖండించాయి. అది ఎంతలా అంటే మొత్తంగా రైతాంగ ఉద్యమానికి, రైతు సంఘాలకే అప్రతిష్టను అంటగట్టేలా వ్యాఖ్యలు చేశాయి. అందువల్ల పరిస్థితులను చక్కదిద్దడం అవసరం. పంజాబ్ లోని గ్రామాల నుండి, హర్యానా లోని పలు ప్రాంతాల నుండి, ఢిల్లీ సరిహద్దుల్లో గల యు.పి జిల్లాల నుండి అలాగే దేశంలోని విభిన్న ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు, ట్రాక్టర్లతోనే ఇటువంటి విశిష్టమైన ప్రజా సమీకరణ సాధ్యమైంది.
జూన్‌లో మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చినప్పటి నుండి పంజాబ్, హర్యానాల్లో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. రైతు సంఘాల సమాఖ్య నేతృత్వంలో ఐదు మాసాల పాటు సాగిన పోరాటానికి విస్తృతమైన స్పందన వచ్చింది. ఈ రైతు సంఘాలు ప్రజల్లో కలిగించగల ప్రభావానికి మించి ప్రజాదరణ, మద్దతు లభించింది. సామాన్య రైతులు, వారి కుటుంబాలు, మొత్తంగా గ్రామ కమ్యూనిటీలు పాల్గొనడంతో ఈ ఉద్యమానికి కింది స్థాయి నుండి ఊతం లభించింది. ఈ ఉద్యమం ఏ ఒక్క రైతు సంఘం లేదా నేత చేతిలో లేదు. అందువల్ల కొన్ని దారితప్పిన శక్తులు పాల్పడిన కొన్ని అవాంఛనీయ సంఘటనలకు రైతు సంఘాలను, వాటి నేతలను నిందించడమంటే ఈ ఉద్యమాన్ని అప్రతిష్టపాల్జేయాలనే కాంక్షే కారణం. ఆందోళనకారుల్లో కొంతమందిని తప్పుదారి పట్టించేందుకు జరిగిన ప్రయత్నాల వెనుక ఎవరు వున్నారనేది త్వరలోనే తెలుస్తుంది. ఈ శక్తులను, వారి చర్యలను 'సంయుక్త కిసాన్ మోర్చా' తీవ్రంగా ఖండిస్తోంది. శాంతియుతంగా ఆందోళన కొనసాగించేందుకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించింది.
అల్లర్లు, హింస గురించి మాత్రమే మాట్లాడుకోవడం కూడా నిజాయితీని శంకించే కుట్రే. ఈ తప్పుదారి పట్టిన ఆందోళనకారులు కూడా నగరంలోకి ప్రవేశించడం ద్వారా కేవలం ఒక పాయింట్‌ను చెప్పాలనుకున్నారు. అంతేకానీ ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్తులపై ఎలాంటి దాడులు జరపలేదు. దుకాణాలను లూటీ చేయలేదు. లేదా సామాన్య ప్రజలపై భౌతిక దాడులకు దిగలేదు. ఎర్రకోటలో విధ్వంసం సృష్టించారు. నిర్దేశిత మార్గాల నుండి కొంతమంది పక్కకు మళ్ళడంతో మొత్తంగా ఉద్యమాన్నే నియంత్రించడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఇరు పక్షాల మధ్య కొంత ఘర్షణ జరిగింది. ఢిల్లీలో జరిగిన సంఘటనలపైనే దృష్టి కేంద్రీకరించడంతో హర్యానాలోని పల్వాల్ నుండి ఢిల్లీ సరిహద్దులకు వస్తున్న ఆందోళనకారులను సిక్రి సరిహద్దు వద్ద హర్యానా పోలీసులు తీవ్రంగా బాదడాన్ని ఇక్కడ మరిచిపోరాదు. వారికి ఢిల్లీ సరిహద్దులకు వెళ్లడానికి పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ చితకబాదారు. ఈ క్రమంలో పోలీసులు బాష్పవాయు గోళాన్ని ప్రయోగించడంతో ట్రాక్టర్‌పై నుండి బోల్తాపడి 23 ఏళ్ళ యువకుడు మరణించడానికి దారి తీసింది. ఢిల్లీ పోలీసులు కూడా రైతులకు చెందిన చాలా ట్రాక్టర్లను ధ్వంసం చేశారు.
దాదాపు రెండు మాసాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసనలు కొనసాగుతున్నాయి. వేలాదిమంది పురుషులు, మహిళలు ఇందులో పాల్గొంటున్నారు. అత్యంత ప్రతికూలంగా వున్న శీతల పరిస్థితులను కూడా తట్టుకుని వారు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. నిరంకుశ వ్యవసాయ చట్టాలను రద్దు చేయించాలన్నదే ఆందోళనకారుల కృతనిశ్చయంగా వుంది. అయితే ప్రభుత్వం మొండితనంతో ఆ చట్టాలను రద్దు చేయడానికి తిరస్కరిస్తుండడంతో జనవరి 26న ట్రాక్టర్ మార్చ్ నిర్వహించడానికి రైతులు సంసిద్ధమయ్యారు.
గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో ప్రజల శక్తి ప్రదర్శితమవడాన్ని మనం చూశాం. బిజెపి పాలకులకు దీన్ని చూసి భయం వేసింది. ఇక రాబోయే రోజుల్లో శాంతియుత ఆందోళనలకు ఆటంకం కలిగించేందుకు, రైతు సంఘాలకు అప్రతిష్టను ఆపాదించేందుకు ప్రయత్నాలు మరింత పెరుగుతాయి. ఇటువంటి ప్రయత్నాలను రైతు సంఘాలు సమైక్యంగా తిప్పికొట్టాలి. ఈ ఘటనలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేశారు. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న దాదాపు 40 మంది నేతల పేర్లను ఇందులో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మూడు మార్గాల్లోనే సాగిన ట్రాక్టర్ల ప్రదర్శనకు వీరు నేతృత్వం వహించారన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా వంచనతో కూడిన చర్య. రైతు నేతలను బాధ్యులుగా చేస్తున్న ఢిల్లీ పోలీసు కమిషనర్... ఎర్రకోట వద్ద అల్లరి మూకను రెచ్చగొట్టి నాయకత్వం వహించిన, బిజెపితో సంబంధాలున్న దీప్ సిద్ధూ గురించి మౌనం పాటిస్తున్నారు. జనవరి 26 సందర్భంగా వివిధ రాష్ట్రాల రాజధానుల్లో, జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్ మార్చ్‌లు, కిసాన్ ర్యాలీలు నిర్వహించారు. దీనికి ముందు నాసిక్ నుండి ముంబయికి బ్రహ్మాండమైన కిసాన్ ర్యాలీ జరిగింది. కోల్‌కతా, చెన్నైలో గత వారంలో కిసాన్, రైతు కూలీల ర్యాలీలు జరిగాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం సాగిస్తున్న రైతులు ఒంటరివారు కాదు, పునరుద్ధరించిన కృతనిశ్చయంతో ఈ ఉద్యమం కొనసాగుతుంది. జనవరి 29 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి పార్లమెంట్‌లో మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ డిమాండ్ సాధన కోసం ప్రతిపక్షం సమైక్యంగా వ్యవహరించాలి.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)










