Aug 01,2023 22:03

ప్రజాశక్తి ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తున్న సెంచూరియన్‌ యూనివర్శిటీ ఛాన్సలర్‌ , ఐఅండ్‌పిఆర్‌ ఎడి, సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ప్రజల కష్టాలు, కన్నీళ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం దిశగా తన వంతు పాత్రపోషిస్తున్న ప్రజాశక్తి ప్రజల పత్రిక అని పలువురు వక్తలు కొనియాడారు. ఈ పత్రిక కార్మిక, కర్షక బంధువు అని పేర్కొన్నారు. ప్రజాశక్తి 43వ వార్షికోత్సవసభ మంగళవారం రెవెన్యూ అసోసియేషన్‌ కల్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రజాశక్తి ముద్రించిన ప్రత్యేక సంచికను సెంచూరియన్‌ యూనివర్సిటీ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జిఎస్‌ఎన్‌ రాజు, సిఐటియు రాష్ట్రప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు, రాష్ట్రకార్యదర్శి కె.సుబ్బరావమ్మ, జిల్లా సమాచార పౌర సంబంధాలశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డి.రమేష్‌, సిపిఎంజిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆవిష్కరించారు. అనంతరం ప్రజాశక్తి స్టాఫ్‌రిపోర్టర్‌ కె.రమేష్‌నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో జిఎస్‌ఎన్‌ రాజు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ప్రజాశక్తి నిలబడింది అంటే అది ప్రజల సహకారం ద్వారానేనని అన్నారు. ఎటువంటి స్వార్థం లేకుండా, ప్రజా హితం కోసం పని చేస్తున్న ఏకైక పత్రిక ప్రజాశక్తి అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉన్న పత్రిక భవిష్యత్‌లో మరింత వద్ది సాధించాలని ఆయన ఆకాంక్షించారు. సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ ప్రజాశక్తికి ప్రజలే యజమానులని, కష్ట జీవుల కష్టాన్ని అక్షర రూపంలో రాసే పత్రిక అని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజల పక్షాన లేవని, ధనవంతులు పక్షాన ఉన్నాయని అన్నారు. పేదవాడి కష్టాలను,కన్నీటిని పాలకుల దృష్టికి తీసుకెళ్తుందన్నారు. జిల్లాలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయని, అదే బాటలో ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమలను మూసివేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని వాటిని రక్షించు కునేందుకు, కార్మికుల ఉపాధి కోసం ప్రజాశక్తి పత్రిక కృషి చేయాలని పిలుపునిచ్చారు. వలసలు జిల్లాగా మారిపోతున్న పరిస్థితులపై కథనాలు రాసి జిల్లా ప్రజలకు అండగా నిలబడాలని కోరారు. ఐఅండ్‌పిఆర్‌ ఎడి డి.రమేష్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వాలు దష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తోందన్నారు. ప్రజలు సమస్యల ప్రతి బింబంగా నిలిచే ప్రజాశక్తి మరింత దిన దినాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ కార్మిక వర్గ పోరాటాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో ప్రజాశక్తి అగ్రభాగాన నిలుస్తుందన్నారు. కార్మిక వర్గ రాజ్యం కోసం, కార్మిక హక్కులు కాపాడటం కోసం జరిగే పోరాటాలకు అండగా ఉంటోందన్నారు. ప్రజాశక్తిని అభివృద్ధి చేసుకోవడం ద్వారా కార్మిక ,కర్షక ఉద్యమాల బలోపేతం చేయడానికి దోహద పడుతుందన్నారు. తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రజాశక్తి కార్మిక,కర్షక, పీడిత ప్రజల పుత్రిక అన్నారు. ప్రతి అక్షరం ప్రజలు పక్షం అన్నా ట్యాగ్‌ లైన్‌ కు అనుగుణంగా ప్రజల కోసం పని చేస్తున్న పత్రిక ను మరింత పెంచి ప్రజలు ల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. 40 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌ లుగా మార్చి కార్మిక హక్కులను కాలరాసే నేటి పరిస్థితుల్లో ప్రజాశక్తిని పెంచుకోవడం ద్వారా కార్మిక హక్కులను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది అని అన్నారు. కార్యక్రమంలో ప్రజాశక్తి సిబ్బంది, కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.