
ప్రజాశక్తి - భీమవరం : వైసిపి ప్రభుత్వం వచ్చాక రోడ్ల అభివృద్ధిని గాలికొదిలేసిందని, ఫలితంగా పాడైపోయిన రోడ్లలో ప్రమాదాలు సంభవించి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని తక్షణం రహదారులను నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జుత్తిగ నరసింహమూర్తి డిమాండ్ చేశారు. అస్తవ్యస్తంగా మారిన నవూడూరు జంక్షన్ నుంచి మడుగుపోలవరం లంక వరకూ రోడ్డు యుద్ధప్రాతిపదికన నిర్మించాలని, వీరవాసరం, నవుడూరు రోడ్డు, పంజా వేమవరం, రాయకుదుదురు రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని, తక్షణం ఆర్‌అండ్‌బి అధికారులు, ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మడుగుపోలవరం లంక నుండి జిల్లా కలక్టరేట్ వరకూ సిపిఎం మోటార్ సైకిళ్ల యాత్ర నిర్వహించింది. సుమారు 25 కిలోమీటర్ల మేర ఈ మోటార్ సైకిల్ యాత్ర సాగింది. జనసేన, టిడిపి ఈ యాత్రకు సంఘీభావం తెలిపాయి. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రెండు కిలోమీటర్ల వరకూ యాత్రలో పాల్గొన్నారు. భీమవరం కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడారు. 2020 నుండి దఫదఫాలుగా రోడ్లు వేయాలని, గోతులు పూడ్చి ప్రజలు ప్రాణాలు నిలబెట్టాలని ఆందోళనలు, ధర్నాలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలు చేసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. జులై 27న జోరున వర్షంలో ఆందోళన చేసి స్పందనలో జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం అందించామని గుర్తు చేశారు. రెండు నెలల వ్యవధిలో వీరవాసరం, నవుడూరు రోడ్డులో 4, నవుడూరు సెంటర్ కొణితివాడ రోడ్డులో 7 మోటారు సైకిళ్ల ప్రమాదాలు జరిగాయన్నారు. ఈ ప్రమాదాల్లో వాహనదారులు గాయాలపాలైౖ ఆసుపత్రులపాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం రోడ్ల గురించి పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే నాధుడే లేడని విమర్శించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణం పాడైన రోడ్లను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ పి.ప్రశాంతికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ ప్రశాంతి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ పోతుల మృత్యుంజయ, బి.సూర్యచంద్రరావు, లింగం సత్యనారాయణ, యాళ్లబండి నారాయణ, తాళ్లూరి రాము, అయినపూడి బాబూరావు పాల్గొన్నారు.
వీరవాసరం :ప్రజలకు ప్రాణసంకటంగా మారిన అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిపై ఆర్‌అండ్‌బి అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా లేదా అంటూ సిపిఎం జిల్లా నాయకులు కేతా గోపాలన్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో చెరువులను తలపిస్తున్న రోడ్లను బాగు చేయాలంటూ సిపిఎం జిల్లా నాయకులు జుత్తిగ నరసింహమూర్తి ఆధ్వర్యంలో చేపట్టిన మోటార్ సైకిల్ యాత్రను సోమవారం కేతా గోపాలన్ జెండా ఊపి ప్రారంభించారు. మండలంలోని మడుగుపోలవరం నుంచి భీమవరం కలెక్టరేట్ వరకూ సాగే ఈ యాత్రలో గోపాలన్ మాట్లాడారు. సంక్షేమం పేరుతో ఈ ప్రభుత్వం అభివృద్ధి మర్చిపోయిందని విమర్శించారు. కొన్ని సంవత్సరాలుగా సిపిఎం ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనలు చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరవాసరం - పెనుమంట్ర ఆర్‌అండ్‌బి రహదారి వెంబడి ఉన్న గోతుల వల్ల అనేక మంది ప్రమాదాలకు గురై గాయాల పాలైనా అధికారులకు కన్పించకపోవడం బాధాకరమన్నారు. 2020 నుంచి అధ్వానంగా ఉన్న ఆర్‌అండ్‌బి రహదారులకు మరమ్మతులు చేయాలంటూ నవుడూరు సెంటర్ నుంచి వీరవాసరం వరకూ పాదయాత్ర చేసి ఆశాఖాధికారులకు వినతిపత్రం అందజేశారు. అదే సంవత్సరం వీరవాసరం తూర్పు చెరువు సెంటర్ వద్ద నిరసన దీక్ష చేశామని తెలిపారు. మరలా ఆర్‌అండ్‌బి కార్యాలయం వద్ద ధర్నా చేశామని, మడుగుపోలవరం నుంచి నవుడూరు సెంటర్ వరకూ వచ్చే ఆర్ అండ్‌బి రోడ్డు వెడల్పు చేయాలని నవుడూరు సెంటర్‌లో నిరసన చేశామని తెలిపారు. ఇన్ని దఫాలుగా ఆందోళనలు, ఫిర్యాదులు చేసినా అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నుంచి హామీలు తప్ప ఆచరణలేదన్నారు. జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ అనేక సార్లు మండలంలోని రోడ్ల దుస్థితిపై అధికారులను ప్రశ్నించగా టెండర్లు పిలిచామంటూ పనులు ప్రారంభిస్తున్నామంటూ చెప్పారు తప్ప ఇంతవరకూ మరమ్మతులు ముందుకు సాగిన దాఖాలాల్లేవని తెలిపారు. ఆర్‌అండ్‌బి అధికారులు యుద్ధ ప్రాతిపదిక రోడ్లకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. జనసేన, టిడిపి మద్దుతు తెలిపిన కార్యక్రమంలో లింగం సత్యనారాయణ, పోతుల మృత్యంజయ, బత్తుల విజయకుమార్, యాళ్లబండి నారాయణమూర్తి, తాళ్లూరి రాము, బొబ్బనపల్లి సూర్యచంద్రరావు, అయినపూడి బాబూరావు పాల్గొన్నారు.