రాష్ట్రంలో రహదారి ప్రమాదాలు ఠారెత్తిస్తున్నాయి. ఒక ఘోరాన్ని మరిచేలోపల మరొకటి సంభవించి ప్రయాణాలంటేనే భయపడేంతగా బెంబేలెత్తిస్తున్నాయి. తరచు రహదారులు నెత్తురోడటం, అమాయకులను బలితీసుకోవడం ఆందోళనకరం. పత్రికల్లో, టీవీలలో రోడ్డు ప్రమాద వార్త లేని రోజే ఉండటం లేదు. మొన్న శనివారం అర్థరాత్రి చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్డు లోయలో బస్సు దూసుకెళ్లిన దుర్ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. వివాహ నిశ్చితార్ధానికి అనంతపురం నుండి తిరుపతి వస్తుండగా విషాదం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారితో సహా ఒకే కుటుంబంలోని ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చిత్తూరులోనే ఆదివారం సంభవించిన మరో ఘటనలో నిశ్చితార్ధానికి వెళుతున్న మినీ బస్సు ట్రాక్టర్‌ను ఢకొీట్టింది. పలువురు గాయపడ్డారు. రోజు విడిచి రోజు ఒకటే జిల్లాలో జరిగిన రెండు ఘోరాలివి. చెప్పుకుంటూ పోతే రహదారి ప్రమాదాల చిట్టా చాలా పెద్దదే. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ఆ పూటకి ఏవో కారణాలు వెతకడం, మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు కొద్ది పాటి ఎక్స్‌గ్రేషియాలు ప్రకటించడం, సంతాపాలు, సానుభూతి తెలియజేయడం తప్ప ప్రమాదాలను అరికట్టడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టింది లేదు. ఆ పని చేసి ఉన్నట్లయితే ఇన్నేసి ప్రమాదాలు జరిగేవి కాదు. రోడ్డు ఘోరాలకు బలవుతున్న, అంగవికలురవుతున్న కుంటుబాల గుండెకోత సర్కారు చెవికెక్కక పోవడం అతిపెద్ద విషాదం.
నిరుడు మన రాష్ట్రంలో 19 వేల పైచిలుకు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఎనిమిది వేలకుపైగా మరణాలు సంభవించాయి. 21 వేలకుపైన గాయపడ్డారు. రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ముందటేడాది కంటే ఘటనలు 4.1 శాతం, మరణాలు 5.6 శాతం పెరిగాయని పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. దేశంలో ముందటేడు, అంతకు ముందు ఏడాది రోడ్డు ప్రమాదాల్లో మన రాష్ట్రం ఎనిమిదో స్థానంలో ఉండగా, నిరుడు ఐదవ స్థానానికి చేరింది. రహదారులపై మరణ మృదంగానికి కారణాలనేకం. మితిమీరిన వేగం, నిర్లక్ష్యం, మద్యపానం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఫిట్‌నెస్ లేని వాహనాలు, ఓవర్‌లోడ్, ప్రైవేటు ఆపరేటర్ల నిబంధనల ఉల్లంఘన, డ్రైవర్లపై పని భారం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం, అవినీతి వగైరా వగైరా. కేంద్రం జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాలు పెట్టి ప్రైవేటుకు దోచిపెట్టడంపై చూపే తహతహలో కొంతైనా ప్రజల ప్రాణాలపై చూపడంలేదు. రాష్ట్ర, జిల్లా రోడ్ల మరమ్మతులు జరిగి చాలా కాలమైంది. ట్రాన్స్‌పోర్టు, పోలీస్ తనిఖీలు నామమాత్రం. జరిగినా వసూళ్ల టార్గెట్‌కే పరిమితం. ప్రభుత్వం ఈ డిపార్టుమెంట్లను ఆదాయ వనరులుగా చూస్తోంది తప్ప ప్రజల ప్రాణాల కోణంలో కాదు. స్టేట్ రోడ్ సేఫ్టీ అథారిటీ అడ్రస్ లేదు. రోడ్ల పక్కన వైన్ షాపులు సరేసరి. ఇన్ని లోపాలు పెట్టుకొని ప్రమాదాలకు కళ్లెం ఎలా ?
రెండేళ్లుగా కోవిడ్ లాక్‌డౌన్లు, ఆంక్షలతో రహదారులపై ట్రాఫిక్ తగ్గింది. ప్రస్తుతం ఆంక్షలన్నీ ఎత్తేస్తున్న దరిమిలా ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కాలంలో రోడ్డు సేఫ్టీపై అంతగా దృష్టి సారించని ప్రభుత్వం పునరుద్ధరణ చర్యలు చేపట్టవలసి ఉంది. రోడ్ ఇంజనీరింగ్ పెరగాలి. తరచు ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్న డేంజర్, బ్లాక్ స్పాట్‌లను గుర్తించి సైన్ బోర్డులతో అప్రమత్తం చేయాలి. హైవేల పక్కన డ్రైవర్లకు విశ్రాంతి స్థలాలు ఏర్పాటు చేయాలి. రోడ్లకు అవసరమైన మరమ్మతులు నిర్వహించాలి. మన రోడ్లకు సరిపడని వెహికల్స్‌ను మార్కెట్‌లో నిషేధించాలి. ప్రమాదాల్లో చాలా భాగం అర్థరాత్రి, వేకువజామున, వేసవిలో సంభవిస్తున్నాయి. నివారణకు మార్గాలు అన్వేషించాలి. టూ వీలర్స్ ప్రమాదాలే ఎక్కువ. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 35 ఏళ్ల లోపు యువత చనిపోవడం, అంగవికలురు కావడం ఆయా కుటుంబాలతోపాటు దేశ, రాష్ట్ర జిడిపికి ఎంతగానో నష్టదాయకం. రోడ్లను కేవలం మౌలిక వసతులు, ఆదాయ వనరులుగానే చూడకుండా ప్రజలందరి, మొత్తం సమాజం అభ్యున్నతికి ప్రభుత్వం పూచీ పడాలి.










