May 09,2023 01:27
యాత్రికుల ప్రాణాలను కాపాడిన పోలీస్‌ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేస్తున్న జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: ఆపదలో వున్న ప్రజల ప్రాణాలు రక్షించడంలో జిల్లా పోలీసులు ఎల్లపుడూ ముందుంటారని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. బాపట్ల జిల్లా సూర్యలంక, వాడరేవు సముద్ర తీర ప్రాంతాలలో సముద్రంలోకి కొట్టుకుపోతున్న యాత్రికుల ప్రాణాలు కాపాడిన సివిల్‌ మరియు మెరైన్‌ పోలీస్‌ సిబ్బందిని సోమవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆదివారం గుంటూరు జిల్లా క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన సుమారు 50 మంది యాత్రికులు వాడరేవు సముద్రతీరంలో విహారయాత్రకు వచ్చి సముద్రంలో మునుగుతుండగా వారిలోని 28 సంవత్సరాల వయస్సు గల సయ్యద్‌ రాజావలి ఒక్కసారిగా వచ్చిన అల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోతుండగా అది గమనించిన కొత్తపట్నం మెరైన్‌ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ ఏ నరేష్‌బాబు, హౌంగార్డు ఎస్‌ శ్రీనివాసరావులు వెంటనే స్పందించి ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లి అలల తాకిడికి కొట్టుకుపోతున్న సయ్యద్‌ రాజావలిని ఒడ్డుకు చేర్చి అతడి ప్రాణాలను కాపాడారు. గత శుక్రవారం విహారానికి సూర్యలంక సముద్ర తీరానికి వచ్చి సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద అలలు రావటంతో నీటిలో మునిగి లోపలికి కొట్టుకుపోతున్న తాడేపల్లికి చెందిన యువకులు ఓ సాయికిరణ్‌, పి కిరణ్‌ లను సూర్యలంక మెరైన్‌ పోలీస్‌ స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ జి గంగాధర్‌రావు, హౌంగార్డ్‌ ఎన్‌ శ్రీనివాసరావు, బాపట్ల రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎం పోతురాజు, కానిస్టేబుల్‌ పి వెంకటరావు, గజ ఈతగాడు సంగని సురేష్‌ లు సముద్రంలోకి వెళ్లి నీటిలో మునిగి కొట్టుకుపోతున్న యువకులను కాపాడి ఒడ్డుకు చేర్చారు. ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. విధినిర్వహణలో సకాలంలో స్పందించి సముద్రంలో కొట్టుకుపోతున్న యాత్రికుల ప్రాణాలను కాపాడిన పోలీస్‌, మెరైన్‌ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బాపట్ల జిల్లా సూర్యలంక, ఓడరేవు సముద్రతీరాలకు విచ్చేసే యాత్రికుల రక్షణ కోసం పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తీరం వెంబడి గస్తీ పెంచామని, సముద్రంలో మునిగి కొట్టుకుపోతున్నవారిని రక్షించడానికి గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సముద్రతీరంలో అలల తాకిడికి కొట్టుకుపోతున్న 39 మంది యాత్రికుల ప్రాణాలను సివిల్‌, మెరైన్‌ పోలీస్‌, గజ ఈతగాళ్లు కాపాడారని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యలంక మెరైన్‌ సిఐ జి సుబ్బారావు, కొత్తపట్నం మెరైన్‌ ఇన్‌స్పెక్టర్‌ కె శ్రీనివాసరావు, జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏ శ్రీనివాస్‌ సిబ్బంది పాల్గొన్నారు.