కడప : ప్రజల ప్రాణ భద్రత మనందరి సామాజిక బాధ్యత అని, ఆ దిశగా జిల్లాలో రహదారుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ వి.విజరు రామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులోలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అత్యధిక శాతం ప్రజలు రోడ్డు ప్రమాదాల కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. జనాభాతో పాటు వాహనాల వినియోగం కూడా పెరుగుతున్న నేపథ్యంలో రవాణా శాఖ, అనుబంధ శాఖల అధికారులు రహదారుల భద్రతపై ప్రత్యేక దష్టి సారించి వాహన ప్రమాదాలను అరికట్టే దిశగా భద్రత చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవలి కాలంలో కడప-కర్నాలు ప్రధాన రహదారిలో చెన్నూరు వద్ద చోటు చేసుకున్న భారీ రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావతం కాకుండ కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్న మలుపుల వద్ద బారికేడ్లు, స్టాపర్స్, ప్రమాద సంకేత సూచికలను పొందుపరచాలని పోలీస్, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతా నియమాలు, సూచికలు, నినాదాలతో ప్రచురించిన గోడ పత్రాలను, హ్యాండ్ బుక్ లను జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో నగర కమిషనర్ ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కమిటీ మెంబర్ కన్వీనర్, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మీరా ప్రసాద్, పీఆర్ ఎస్.ఈ శ్రీనివాసులు రెడ్డి, ఆర్ అండ్ బి డిఇ మాధవి, డిఎంహెచ్‌ఒ నాగరాజు, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి, ఆర్‌అండ్‌బి, విద్యుత్ శాఖల ఎఇలు ట్రాఫిక్, పోలీసు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.










