కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానించి కేరళ ఆదర్శంగా నిలిచింది. సేద్యానికి, దేశ ప్రజల ఆహార భద్రతకు ముప్పు తెచ్చే వినాశకర చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో పాత సంవత్సరానికి వీడ్కోలు కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంపై రుద్దిన సాగు చట్టాల ఉపసంహరణ కోసం రాజధాని ఢిల్లీ శివార్లలో లక్షల మంది రైతులు నిరవధిక ఉద్యమం చేపట్టగా, సంఘీభావంగా కేరళ వామపక్ష ప్రభుత్వం గురువారం ప్రత్యేకంగా శాసనసభ సమావేశాన్ని నిర్వహించింది. కాగా రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకుని బాధ్యతలో ఉన్న గవర్నర్, అందుకు విరుద్ధంగా మోడీ సర్కారు ఏజెంట్ అవతారం ఎత్తి ప్రజలెన్నుకున్న ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అసెంబ్లీని సమావేశపర్చబోతే మోకాలడ్డబోయి బోర్లాపడారు. తీర్మానానికి అసెంబ్లీ లోని అన్ని రాజకీయ పక్షాల మద్దతు లభించడం అరుదైన ఘనత. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నేతృత్వం లోని యుడిఎఫ్‌తో పాటు ఏకైక బిజెపి ఎమ్మెల్యే సైతం తీర్మానానికి మద్దతు పలికారు. దాంతో తీర్మానంపై ఏకాభిప్రాయం లభించింది. కేరళ ఆహార ధాన్యాల వినిమయదారీ రాష్ట్రం. కేంద్ర చట్టాల వలన బయటి నుంచి రాష్ట్రానికి ఆహార ధాన్యాలు సక్రమంగా రాకపోతే ప్రజలు, ముఖ్యంగా పేదలు ఆకలితో అలమటిస్తారని వివరిస్తూ కొత్త చట్టాల దుష్పరిణామాలను వామపక్ష ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా ఏకగ్రీవ తీర్మానానికి ప్రధాన కారణం.
కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు జీహుజూర్ అంటుండగా కేరళ ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు అమల్లో పెట్టి ప్రజల పక్షం వహించిందనడానికి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొన్న తీరు ప్రపంచానికే రోల్ మోడల్. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కేరళ కృషిని ప్రత్యేకంగా ప్రశంసించింది. లాక్‌డౌన్‌లో ప్రజలందరికీ ఉచితంగా బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు వంటి నిత్యావసర వస్తువులను అందించింది. వండిన ఆహారాన్ని బడి పిల్లలకు, అంగన్‌వాడీ లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేసింది. వలస కార్మికులను తమ అతిథులుగా ప్రకటించి సాయమందించింది. అందుకే దేశ వ్యాప్తంగా వలస కార్మికులు స్వస్థలాలకు కాలిబాటన పయనమవగా కేరళలో అలాంటి ఘోర దృశ్యాలు కనిపించలేదు. ఓనం పండగ తర్వాత పాజిటివ్ కేసులు కొంత వరకు పెరిగినా స్వల్ప వ్యవధిలోనే కట్టడి చేసి మరణాల సంఖ్యను కనిష్టానికి పరిమితం చేసింది. ఈ విజయాలకు ప్రధాన హేతువు ప్రభుత్వరంగంలో ప్రజారోగ్యాన్ని పటిష్టం చేయడం, ప్రజలను భాగస్వాములను కావించడం. కరోనా వ్యాక్సిన్‌పై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతుండగా రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకాను అందిస్తామని ఎల్‌డిఎఫ్ సర్కారు ఇచ్చిన భరోసా దాని ప్రజా కోణానికి ప్రతీక.
రైతులకు ఇప్పుడున్న కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ను సైతం దూరం చేసి, కార్పొరేట్ల గుప్పెట్లోకి నెట్టాలని కేంద్రం చట్టాలు తీసుకురాగా, కేరళ ప్రభుత్వం రైతులకు అదనపు బోనస్‌లు ఇస్తోంది. వరికి కేంద్రం ప్రకటించిన ఎంఎస్‌పి క్వింటాలుకు రూ.1,865 కాగా కేరళలో దేశంలోనే అత్యధికంగా రూ.2,630 లభిస్తోంది. ఎంఎస్‌పి వర్తించని 16 రకాల కూరగాయ పంటలకు ఎంఎస్‌పి ప్రకటించింది. ఒక్క రైతులే కాదు అన్ని అంశాల్లోనూ కేరళ దేశానికి మార్గదర్శకత్వం వహిస్తోంది. కరోనా వచ్చాక ఇప్పుడు అందరూ డిజిటల్ టీచింగ్ అంటుండగా ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూములను ఎంతో ముందుగానే కేరళ ప్రవేశపెట్టింది. నయా-ఉదారవాద యుగంలో ప్రభుత్వాలు అన్నింటా కార్పొరేట్ జపం చేస్తుండగా కేరళ సర్కారు కో-ఆపరేటివ్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో ప్రతిపక్ష యుడిఎఫ్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా వాటిని ఎల్‌డిఎఫ్ ఎదుర్కొంటోందంటే అందుకు అది ఎంచుకున్న ప్రజాపక్ష, ప్రత్యామ్నాయ రాజకీయాలే అండా దండా.










