ప్రజాశక్తి - వేటపాలెం
ప్రజలు తనను ఎంతో నమ్మకంతో గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. మండలంలోని దేశాయిపేటలో నూతనంగా నిర్మించిన సచివాలయాలు-2, 4, రైతు భరోసా కేంద్రాన్ని ఆయన బుదవారం ప్రారంభించారు. రూ.61.80లక్షలతో రైతు భరోసా కేంద్రం, రూ.40లక్షలతో సచివాలయం నిర్మాణం చేసినట్లు తెలిపారు. వివేకానంద కాలనీ ప్రక్కన దిబ్బల మీద 20ఏళ్ల క్రితం పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు పొజిషన్ చూపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నారని, ఆ సమయంలో తనకున్న అనుబంధం గురించి వివరించారు. చీరాల నియోజకవర్గ ప్రజలకు మేలు చేసేందుకే బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు ఒకానొక సందర్భంలో వచ్చిన చర్చలలో కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని కలిసి ఒకే ఒకటి అడిగగా, తనయుడు వెంకటేష్ బాబు గురించి తనకు వదిలేయాలని జగన్ మోహన్ రెడ్డి అన్నారని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన సత్రం మల్లేశ్వరరావు, కర్ణ లచ్చారావు మాట్లాడుతూ కరణం బలరామకృష్ణమూర్తి చీరాల ప్రజలకు స్వేచ్ఛ, ప్రశాంతత ఇచ్చారని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు నివేశ స్థలాల పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో వైసిపి ఇంచార్జీ కరణం వెంకటేష్, ఆర్డీవో సరోజినీ, తహశీల్దారు అశోక వర్ధన్, ఎంపీడీవో రూతుమ్మ, వేటపాలెం ఆర్‌బికె చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు, చీరాల ఆర్‌బికె చైర్మన్ కావూరి రమణారెడ్డి, మాజీ సర్పంచి లేళ్ల శ్రీధర్, కట్టా గంగయ్య, కర్ణ లక్షరావు, బొడ్డు సుబ్బారావు, కర్ణ ప్రసాద్, బట్ట శ్రీను, దంతం మంతు, బట్ట సుబ్బారావు, బండారు విజయ్, ప్రుద్వి చంద్ర మోహన్, సాధు రాఘవ, జిడుగు మస్తాన్, అందే కృష్ణ పాల్గొన్నారు










