ప్రజాశక్తి-బల్లికురవ రూరల్: దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా గ్రామ సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థలను ఏర్పాటుచేసి అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు ప్రజల ముంగిటికే తీసుకువచ్చి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పని చేస్తున్నారని శాప్‌నెట్ చైర్మన్, వైసిపి అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాచిన కృష్ణ చైతన్య అన్నారు. గురువారం మండల పరిధిలోని కూకట్లపల్లి గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, యువకులు, నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉత్సాహంగా నడిచారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, కరపత్రాలు పంపిణీ చేశారు. చైతన్య మాట్లాడుతూ మరో ఏడాదిలో జరగనున్న ఎన్నికల్లో మరొకసారి ప్రజలంతా జగన్మోహన్‌రెడ్డికి అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంతమాగులూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ చింతల పేరయ్య, వైస్ ఎంపీపీ ఇప్పల వెంకటసుబ్బారెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు షేకు శ్రీను వలి, ప్రచార కమిటీ అధ్యక్షుడు టి నరేష్, దివ్య, రామాంజనేయులు, రామిరెడ్డి, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.










