Nov 01,2023 21:03

ప్రజాశక్తి - భీమవరం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు అన్ని వర్గాల ప్రజలూ అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ఈ నేపథ్యంలో సిపిఎం ప్రత్యేక ప్రజా ప్రణాళిక రూపొందించి ప్రజల ముందుకు తెచ్చిందని పార్టీ జిల్లా కార్యదర్శి బి.బలరాం తెలిపారు. స్థానిక సుందరయ్య భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజా రక్షణ భేరి యాత్రకు సంబంధించి వివరాలను బలరాం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత మతోన్మాద శక్తులను పెంచి పోషిస్తోందన్నారు. నిత్యావసర ధరల అదుపులో కేంద్రం విఫలమైందన్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు కూలీలుగా మారారన్నారు. ప్రభుత్వ ఆస్తులను, సంస్థలను కారు చౌకగా అమ్మకాలు చేపట్టిందని, ఈ విధానాన్ని ప్రజలు తిప్పి కొట్టాలని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, పోలవరం ప్రాజెక్టు నిధి లేకుండా గాలికి వదిలేసిందని అన్నారు. ప్రజా సంఘాలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ముందుకొస్తే సెక్షన్‌ 144, సెక్షన్లు 30 యాక్ట్‌ విధించి గృహ నిర్బంధాలు చేస్తున్నారన్నారు. దీనిపై కోర్టు, ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. దళితులు, మహిళలపై దాడులు పెరిగిపోయాయని, వాటిని అదుపు చేయడంలో అధికారులు, ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. పంటలకు మద్దతు ధర ఇచ్చి కౌలు రైతులను ఆదుకోవాలన్నారు. వృద్ధాప్య పెన్షన్‌ రూ.3 వేల నుండి రూ.5 వేల పెంచాలన్నారు. రూపాయికి విద్యుత్‌ యూనిట్‌ అందించాలని, 300 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. రూ.400కు గ్యాస్‌ రూ.60కి పెట్రోల్‌, డీజిల్‌, ఉచితంగా ఇసుక అందించాలన్నారు. ఈ నెల 8న ప్రజా రక్షణ భేరి రాష్ట్ర యాత్ర జిల్లాకు రానుందన్నారు. మూడు రోజులు పాటు ఈ యాత్ర జిల్లాలో పర్యటించనుందన్నారు. ఈ నెల 3న ఆకివీడు, తాడేపల్లిగూడెం నుంచి రెండు జిల్లా జాతాలు ప్రారంభించనున్నమన్నారు. ఏడు నియోజకవర్గాల్లో ఈ జాతాలు ప్రచారం చేయనున్నాయని చెప్పారు. నియోజకవర్గ కేంద్రాల్లో సభలు ఏర్పాటు చేయనున్నామని, ఈనెల 15న విజయవాడలో ధర్నా నిర్వహించనున్నామని చెప్పారు. ఈ ధర్నాకు ఆల్‌ ఇండియా నాయకులు పి.మధు, వెంకట్‌, వి.శ్రీనివాసరావు, ధనలక్ష్మి, అగ్ర నేతలు హాజరుకానున్నారని చెప్పారు. ధర్నాలో అంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పనుల్లేక పస్తులుంటున్నారన్నారు. ఆక్వా, వ్యవసాయ రంగం దెబ్బతిన్నాయని, మహిళలు ఉపాధి కోల్పోయారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాలకు వలసలు వెళుతున్నారన్నారు. జిల్లాలో కాలుష్యం బాగా పెరిగిందని, దీంతో తాగునీరు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వైద్యం, ఉపాధి, తాగునీరు ప్రజలందరికీ అందించాలని జాతాల్లో చాటి చెప్పడం జరుగుతుందన్నారు. జిల్లా జాతాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.వాసుదేవరావు పాల్గొన్నారు.