ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు ఇంటి ముంగిటకే అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం క్యాంపులు నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ అధికారును గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఫిరంగిపురం మండలం మునగపాడులో ఫ్యామిలీ డాక్టర్ విధానం క్యాంపును, జిల్లా పరిషత్ పాఠశాలను జిల్లా కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. పంచాయితీ కార్యాలయం వద్ద జరుగుతున్న క్యాంపులో రోగులకు నిర్వహించే వైద్య పరీక్షలను పరిశీలించారు. ఓపీ వివరాల రిజిస్టర్ పరిశీలించి ఎఎన్‌ఎం, ఆశాలతో ఓపీకి వచ్చే రోగులకు అందించే వైద్యసేవల వివరాలు తెలుసుకున్నారు. మందుల సరఫరా, వైద్య పరీక్షల గురించి వైద్యసేవలు అందిస్తున్న వైద్యాధికారితో మాట్లాడారు. చికిత్స కోసం వచ్చిన వృద్ధులు, మహిళలు, గర్భిణులను క్యాంపులో అందిస్తున్న వైద్యసేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. షుగర్, బీపీ మాత్రల కోసం గతంలో ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు గ్రామంలోనే అందిస్తున్నారని స్థానికులు అన్నారు. గర్భిణులకు ప్రతినెలా అవసరమైన వైద్య పరీక్షలు చేస్తున్నారని, మందులు అందిస్తున్నారని, దీర్ఘకాలిక రోగాలకు సంబంధించి జిల్లా ఆసుపత్రికి వెళ్లకుండానే ఇక్కడే మందులు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో కుటుంబ వైద్యుని విధానం క్యాంపు నిర్వహించే తేదిని ముందుగానే ప్రజలందరికీ తెలిసేలా ఆశాలు, ఎఎన్‌ఎంలు విస్తృ తంగా ప్రచారం కల్పించాలన్నారు. ఓపీ రిజిస్టర్‌లో రోగుల వివరాలతో పాటు ఫోన్ నెంబర్లు నమోదు చేయాలని, క్యాంపు జరిగే రోజు ఫాలో అప్ అవసరమైన వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించాలన్నారు. షుగర్, బీపీ రోగులకు నెలకు సరిపడా మందులు అందించాలన్నారు. గర్భిణులకు ప్రతినెలా అవసరమైన పరీక్షలు క్రమంతప్పకుండా నిర్వహించాలని, సుఖ ప్రసవాలు జరిగేలా ముందస్తుగానే ఆసుపత్రులలో చేర్పించాలని చెప్పారు. మంచంలో ఉన్న రోగులకు ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యసేవలు అందిచాలని, అంగన్‌వాడీ కేంద్రంలోను, పాఠశాలను సందర్శించి వైద్యపరీక్షలు నిర్వహించాలని, రక్తహీనత ఉన్నవారికి అవసరమైన మందులు అందించాలన్నారు. అనంతరం స్థానిక జెడ్‌పి పాఠశాలలో మధ్యాహ్న మధ్యహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్ధులతో కలసి కలెక్టర్ భోజనం చేశారు. డీఈవో, ఎంపీడీవో, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో జిల్లా కలెక్టర్ సమావేశమై పాఠశాలలోను, మండలంలోని పాఠశాలలో గ్రాస్ ఎన్ రోల్మేంట్ రేషియోపై సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ లేకుండా ఎంఈవోలు, ఎంపీడీవోలు సచివాలయంలోని ఎడ్యుకేషన్ సెక్రటరీలు, వాలంటీర్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ, బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్పించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వేలో గుర్తించిన పిల్లలను పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్లస్టర్ వారీగా ఎడ్యూకేషన్ సెక్రటరీలు, వాలంటీర్ల నిర్వహిస్తున్న సర్వేను మంగళవారం సాయంత్రం నాటికి పూర్తి చేయాలన్నారు. అన్ ఎన్ రోల్డ్ విద్యార్థులకు సంబంధించి కారణాలు తెలిపాలని, ఎంపీడీవో, ఎంఈవోలు క్లస్టర్‌లలో జరుగుతున్న సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందించాలన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపించని తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వాలని, పాఠశాలలో ప్రతి ఒక్కరు మధ్యాహ్న భోజనం, కోడి గుడ్డు తినేలా ఉపాధ్యాయుల పర్యవేక్షించాలని, రక్తహీనత ఉన్న పిల్లలు కచ్చితంగా మధ్యాహ్న భోజనం పాఠశాలలో తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రక్తహీనత ఉన్న పిల్లలకు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం తరువాత ఐరన్ సుక్రోస్ మాత్రలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రావణ్‌బాబు, జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మీ, ఫ్యామిటీ డాక్టర్ నోడల్ అధికారి డాక్టర్ అన్నపూర్ణ, వైద్యాధికారి డాక్టర్ యానీ, ఎంపీడీవో అనురాధ, ఈవోపీఆర్డీ నిర్మల లక్ష్మీ కుమారి, ఎంఈవోలు మహబుబ్ సుభానీ, రవికాంత్, హెచ్‌ఎంలు అంజలీదేవి, పంచాయతీ సెక్రటరీ విష్ణువర్థన్ పాల్గొన్నారు.










