ప్రజాశక్తి -నెల్లూరు ప్రతినిధి :రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన విధానం మార్పు చేశామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 77వ స్వాతంత్య్ర దినోవత్సం సందర్భంగా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం కలెక్టర్ ఎం. హరినారాయణన్, ఎస్‌పి తిరుమలేశ్వరరెడ్డితో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రగతిపై మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర నిర్మాణంలో భాగంగా అభివద్ధి పథకంలో ఉన్నత లక్ష్యాలను సాధించడానికి నవరత్నాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పేదల అభ్యున్నతికి వైఎస్‌ఆర్ రైతు భరోసా, వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ, 15 రకాల పింఛన్లు, పేదలందరికీ ఇళ్లు, వైఎస్‌ఆర్ ఆసరా, వైఎస్‌ఆర్ చేయూత, వైఎస్‌ఆర్ జలయజ్ఞం, వైఎస్‌ఆర్ మద్యపాన నిషేధం, అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన పాటు ఇతర సంక్షేమ పథకాలతోపాటు వైఎస్‌ఆర్ వాహన మిత్ర, వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం, వైఎస్‌ఆర్ కాపు నేస్తం, 104,108 అంబులెన్సులు, జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్షా పథకం, జగనన్న వసతి దీవెన, జగనన్న తోడు, ప్రత్యేక వాహనాల ద్వారా ఇంటింటికి నిత్యావసరాలు పంపిణీ, వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ వంటి ఎన్నో పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలవుతున్నాయన్నారు. పారదర్శకతతో కూడిన సుపరిపాలనలో భాగంగా శాస్త్ర సాంకేతిక సహాయంతో నూతన విధానాలను ఆనుసరిస్తూ గ్రామాలు, పట్టణాల సర్వతోముఖాభివద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిరహిత సమాజం కోసం అకుంఠిత దీక్షతో పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలిపి, సంక్షేమ ఫలాలను సత్వరమే అర్హులందరికీ వారి వారి ఇళ్లకు అందించేలా జిల్లాలో 769 గ్రామ మరియు వార్డు సచివాలయాలను, 561 రైతు భరోసా కేంద్రాలను స్థాపించి అన్ని శాఖలకు చెందిన 11 మంది కార్యనిర్వాహక సిబ్బందితో 13 వేల 744 మంది వాలంటీర్లను నియమించినట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసిందన్నారు. 'వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం కిందట
అర్హులైన ప్రతి కర్షక కుటుంబానికి పెట్టుబడి రాయితీగా రూ. 13,500 చొప్పున ఇప్పటి వరకు జిల్లాలో 2 లక్షల 12 వేల కుటుంబాలకు రూ. 118 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేసినట్లు తెలిపారు. డాక్టర్ వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకము ద్వారా 640 గ్రూపులకు 66 కోట్ల విలువగల యంత్ర పరికరాలు అందించి 23.16 కోట్ల రూపాయలు రైతు గ్రూపులకు సబ్సిడీ అందించడమైనదన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 87.36 కోట్ల రూపాయల విలువ కలిగిన 39 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందించినట్లు తెలిపారు. జిల్లాలో ఉద్యాన పంటల అభివద్దికి ''సమీకత ఉద్యాన అభివద్ధి మిషన్'' ఆర్.కె.వి.వై పథకాల కిందట ఒక కోటి 98 లక్షల రూపాయల రాయితీని ఒక వేయి 95 మంది రైతుల ఖాతాలలో జమ చేసినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించిన కష్ణపట్నం పోర్ట్ ద్వారా సుమారుగా 7,500 మందికి ప్రత్యక్షంగానూ, 20 వేల మందికి పరోక్షంగాను ఉపాధిó కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా గ్రామీణాభివద్ధి శాఖ ద్వారా ''వై.యస్.ఆర్. పింఛను కానుక పథకము'' కింద ఈ ఆర్థికం సంవత్సరంలో ఇప్పటి వరకు 3,07,447 మంది పెన్షన్ దారులకు సంవత్సరానికి ఒక వేయి 425 కోట్ల 26 లక్షల రూపాయల పెన్షన్ నగదును ప్రతి నెల 1వ తేదీనే అందచేస్తున్నట్లు మంత్రి వివరించారు.
డాక్టర్ వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకం'' క్రింద 2 లక్షల 15 వేల 657 మందికి వివిధ కార్పోరేట్ హాస్పిటల్ లో శస్త్ర చికిత్సలు చేసి, 539 కోట్ల 89 లక్షల రూపాయలు ఖర్చు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్ మెంట్ ఛైర్మన్ నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి, శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మనాథ్, నగర కార్పొరేషన్ కమీషనర్ వికాస్ మర్మత్, అసిస్టెంట్ కలెక్టర్ సంజనా సింహ, పాల్గోన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నెల్లూరు దర్గామిట్టలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు, గొలగమూడి ఎపి బిసి వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు, నెల్లూరులోని రోషన్ రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు, బిట్రగుంట లోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, గొలగమూడిలోని ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్ విద్యార్థులు, నెల్లూరు శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు, ఎఎస్ పేట లోని కస్తూర్భా గాంధీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు, సర్వేపల్లిలోని ఎపి ట్రైబల్ వెల్ఫేర్ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు జాతీయ భావన పెంపొందించేలా ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులకు మంత్రి మెమోంటోలను అందచేశారు.










