ప్రజాశక్తి-విజయనగరం : ప్రజల ఆరోగ్య పరిరక్షణే పరమావధిగా, ఇంటి ముంగిటకే వైద్య సేవలను అందించే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సిఎం జగన్ రూపొందించారని జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రెండు జిల్లాల పిఆర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీరింగ్ అధికారులు, ఎంపిడిఒలు, ఇఒపిఆర్‌డిలతో జెడ్‌పి సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష, పింఛన్లు, ప్రాధాన్యతా భవనాల నిర్మాణం, గడపగడపకు మన ప్రభుత్వం, వాలంటీర్ల ఖాళీలు, పంచాయతీరాజ్ శాఖ కార్యక్రమాలపై సమీక్షించారు. ఆయా అధికారుల ద్వారా సంబంధిత ప్రగతి నివేదికలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 30 నుంచి ప్రారంభమయ్యే ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను, అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. సుమారు 105 రకాల మందులను ఉచితంగా అందించి, 14 రకాల వైద్య పరీక్షలను శిబిరాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డుల్లో పొరపాటున వయసు తక్కువగా నమోదైన వారు దరఖాస్తు చేసుకొంటే, వారికి మెడికల్ బోర్డు ద్వారా వయసు నిర్ధారించి, అర్హత ఉన్నవారికి పింఛను మంజూరు చేస్తామన్నారు. గడపగడపకు మన ప్రభుత్వంతో సహా అన్ని ప్రభుత్వ భవనాలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని కోరారు. ఇంజినీరింగ్ సహాయకుల సేవలను వినియోగించుకోవాలని, బిల్లులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని సూచించారు. నిధులకు ఎక్కడా ఇబ్బంది లేదని తెలిపారు. వాలంటీర్ల ఖాళీలను ప్రతీవారం భర్తీ చేయాలని ఎంపిడిఒలను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. వారంలో కనీసం మూడు రోజులపాటు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్‌పి సిఇఒ కె.రాజ్‌కుమార్, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎంపిడిఒల సంఘం నూతన కార్యవర్గం
అనంతరం ఎంపిడిఒల సంఘం ఉమ్మడి విజయనగరం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా కె.రాజ్‌కుమార్ (జెడ్‌పి సిఇఒ) అధ్యక్షులుగా శంబంగి రామకష్ణ (తెర్లాం), ఉపాధ్యక్షులుగా సాల్మన్‌రాజు (గుమ్మలకీëపురం), ప్రధాన కార్యదర్శిగా కె.రామకష్ణరాజు (చీపురుపల్లి), సంయుక్త కార్యదర్శులుగా రమాదేవి (సాలూరు), బి.ఎస్.కె.ఎన్.పట్నాయక్ (వేపాడ) కోశాధికారిగా కె.శేషుబాబు( శృంగవరపుకోట) ఎన్నికయ్యారు.










