Jun 05,2023 21:08

స్పందనలో తహశీల్దార్‌, ఎంపిడిఒకు వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-ఆలూరు
పట్టణంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన దుకాణాలను ప్రజల ద్వారా తామే ప్రారంభిస్తామని సిపిఎం నాయకులు తెలిపారు. నూతనంగా నిర్మించిన పంచాయతీ షాపులు, ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఉన్న షాపులను వెంటనే బహిరంగ వేలం వేసి ప్రారంభించాలని కోరారు. సోమవారం స్పందనలో తహశీల్దార్‌ విజరు కుమార్‌కు, ఎంపిడిఒ అల్లాబకాష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్‌ నాయకులు కెపి.నారాయణ స్వామి, మండల కార్యదర్శి షాకీర్‌ మాట్లాడారు. ఆలూరులో కూరగాయల మార్కెట్‌ స్థలంలో దాదాపు రూ.1.20 కోట్లతో 27 షాపుల నిర్మాణం పూర్తిచేసి దాదాపు మూడేళ్లయిందని తెలిపారు. అలాగే ఎంపిడిఒ కార్యాలయం ముందు దాదాపు రూ.80 లక్షలతో 18 షాపులు నిర్మించి దాదాపు రెండేళ్లు పూర్తయిందని చెప్పారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించి అధికార పార్టీ నాయకులు, సర్పంచి మధ్య పంపకాలు కుదరకపోవడం వలన ప్రారంభానికి నోచుకోవడం లేదన్నారు. రాష్ట్ర మంత్రి నియోజకవర్గ కేంద్రమైన ఆలూరులో సమస్య ఉండడం దురదృష్టకరమని తెలిపారు. అధికారులు స్పందించి కూరగాయల మార్కెట్‌లో ఉన్న షాపులను, ఎంపిడిఒ కార్యాలయం ముందు ఉన్న షాపుల టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ప్రజలను సమీకరించి ప్రజల చేత ప్రారంభింపజేయిస్తామని హెచ్చరించారు. నాయకులు కృష్ణ, మైనా, గోవర్ధన్‌, హుస్సేని పాల్గొన్నారు.