మాట్లాడుతున్న రాజగోపాల్‌రెడ్డి
ప్రజల చూపంతా వైసిపి వైపే
ప్రజాశక్తి-సీతారామపురం:రాష్ట్రంలోని ప్రజలందరూ వైసీపీ వైపు మొగ్గుచూపి 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీకి అధికారం అందించడానికి సిద్ధంగా ఉన్నారని ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని దేవమ్మ చెరువు పంచాయతీలో కొంతమంది టిడిపి కుటుంబాలు మేకపాటి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరాయి. టిడిపి శ్రేణులకు మేకపాటి రాజగోపాల్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మత, పార్టీలు అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందిందన్నారు. ప్రతి పథకం పారదర్శకంగా ప్రజలకు చేరుతుండడంతో ప్రజలందరూ వైసిపి పాలనవైపు ఆకర్షితులై రాష్ట్రమంతటా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జేజేలు కొడుతున్నారన్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్ది రాష్ట్రంలో టిడిపి కనుమరుగవుతుందని జ్యోస్యం చెప్పారు. జీవితకాలం ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోతారన్నారు. ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త గ్రామాలలోని ప్రతి ఇంటికి తిరిగి వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి వైసిపిని బలోపేతం చేసి రాబోయే ఎన్నికలలో ఇతర పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధి బుక్‌లెట్లను అందించారు. కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి, సొసైటీ అధ్యక్షుడు రామిశెట్టి తిరుపతయ్య, వైస్ ఎంపీపీ బసిరెడ్డి కష్ణారెడ్డి, అయ్యవారి పల్లి సర్పంచ్ చింతన బోయిన దుర్గయ్య యాదవ్, ఉప సర్పంచ్ లకిడి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.










