Nov 09,2023 22:04

బాడంగి.. నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శంబంగి

ప్రజాశక్తి-బాడంగి :  ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంతో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు. గురువారం మండలంలోని ముగడ గ్రామంలో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్‌ క్లినిక్‌ సెంటర్‌ భవనాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రాలకు తిరిగే పనిలేకుండా గ్రామ స్థాయిలోనే ప్రభుత్వం అందించే అనేక రకాల సేవలు వినియోగించుకునేలా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సచివాలయ ఉద్యోగులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి పెద్దింటి రామారావు, డిఇ అప్పారావు, వైసిపి నాయకులు తెంటు మధుసూదన్‌, మండల కన్వీనర్‌ బి.వెంకట్‌ నాయుడు, వై.శివప్రసాద్‌, జెసిఎస్‌ మండల కన్వీనర్‌ మరిపి శంకర్‌రావు నాయుడు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
క్రీడల అభివృద్ధికి ఇండోర్‌ స్టేడియం
బొబ్బిలి :
బొబ్బిలి, పరిసర ప్రాంతాల్లో క్రీడలను అభివృద్ధి చేసేందుకు ఇండోర్‌ స్టేడియం నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. ఐటిఐ కాలనీ వద్ద బుడా నిధులు రూ.1.15 కోట్లతో ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొబ్బిలి ప్రాంత క్రీడాకారులు ఇండోర్‌ స్టేడియం నిర్మించాలని ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నారన్నారు. టిడిపి హయాంలో ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకున్నా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు పూర్తి చేయలేదన్నారు. క్రీడాకారుల కోసం ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి బుడా నిధులు రూ.1.15 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఆరు ఎకరాల స్థలంలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొదటి విడతగా ప్రహరీ నిర్మాణం పూర్తి చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరులు శంబంగి వేణుగోపాలనాయుడు, మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీ కృష్ణారావు, వైస్‌ చైర్మన్లు గొలగాన రమాదేవి, చెలికాని మురళీకృష్ణ, బుడా ప్రతినిధి ఇంటి గోపాలరావు, మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరావు, కౌన్సిలర్లు తెంటు పార్వతి, బాబు, తదితరులు పాల్గొన్నారు.