ప్రజాశక్తి - అద్దంకి
బాబు హామీలు - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని పట్టణంలోని కామేపల్లి కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ నేటి నుండి 45 రోజుల పాటు జరిగే భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమ నిర్వహణపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నవ్యాంధ్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి చంద్రబాబు భరోసా అని ప్రజలు విశ్వసిస్తున్నట్లు తెలిపారు. గత నాలుగేళ్లుగా వైసిపి ప్రజలకు చేస్తున్న మోసాలను తెలియజేయాలని కార్యకర్తలను కోరారు. ఆడబిడ్డల్ని మహాశక్తిగా మార్చే మహాశక్తి పధకం, ఏడాదికి ఉచితంగా 3గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 18నుంచి 59ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1500, ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15వేలు, యువతకు రూ.3వేల నిరుద్యోగ భృతి, 20లక్షల ఉద్యోగాల భర్తీ, రైతులకు ఏడాదికి రూ.20వేలు, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, కుళాయి ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు, పూర్ టు రిచ్‌తో పేదల్ని ధనికులుగా చేసేందుకే మేనిఫెస్టో సూపర్ సిక్స్ గురించి ఇంటింటికి వెళ్లి వివరించాలని కోరారు.










