
ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత
ప్రజాశక్తి-గుంటూరు : ప్రతి ఒక్కరూ వ్యతిగత భాద్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే స్వచ్చ నగరాలు సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ అన్నారు. ఆదివారం గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బిఆర్ స్టేడియం వద్ద ఉన్న మున్సిపల్ రెడ్ ట్యాంక్ కాంప్లెక్స్‌లో స్వచ్ఛతా హి సేవ ఏక్ తారీఖ్ ఏక్ గంట శ్రమదాన్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, మద్దాలి గిరిధర్, డిప్యూటీ మేయర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొని కాంప్లెక్స్ పరిసరాలను శుభ్రం చేసి, మట్టి కుప్పలను తొలగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్చ సర్వేక్షణ్‌కు ప్రాధాన్యమిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆయా నగరాలు, గ్రామాలు స్వచ్ఛంగా మారుతాయని అన్నారు. ఒక్కరోజుకే పరిమితం కాకుండా భాధ్యతగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని కోరారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ స్వచ్ఛత పాటిస్తే మనతో పాటు మన చుట్టు ఉన్న వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వారమవుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లో చెత్త తరలింపునకు ఈ-ఆటోలను అందుబాటులోకి తెచ్చారన్నారు. మేయర్ మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా మార్చుకోవడం ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, వార్డు సచివాలయాల వారీగా స్వచ్చ నగరంగా గుంటూరుని మార్చుకోవడానికి ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామన్నారు. కమిషనర్ మాట్లాడుతూ త్వరలో రెడ్‌ట్యాంక్ కాంప్లెక్స్‌ని వినియోగంలోకి తీసుకురావడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. కాంప్లెక్స్‌లో రెడ్యూస్, రీ సైకిల్, రీ యూజ్ (ఆర్.ఆర్.ఆర్.)సెంటర్‌ని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ప్రజలు, విద్యార్థులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వనమా బాలవజ్రబాబు, షేక్ సజిలా, జిఎంసి అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రైల్వే స్టేషన్ రోడ్డును స్వచ్ఛతా కోసం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. కలెక్టర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, మేయర్ తదితరులు చీపురులతో రోడ్డును శుభ్రం చశారు. గోడలపై ఉన్న పోస్టర్లను తొలగించిరంగులేశారు.
ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : నరసరావుపేట మండలంలోని లింగంగుంట్ల గ్రామపంచాయతీ పరిధిలో శంకర భారతిపురం హైస్కూల్ వద్ద రోడ్డులో పల్నాడు కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆధ్వర్యంలో రెండు గంటలపాటు శ్రమదానం చేశారు. రోడ్డుకిరువైపులా ఉన్న చెత్త చెదారం, పాఠశాల ఆవరణలోని చెత్త కుప్పలు, స్కూలుకు ముందు భాగంలో ఉన్న మురుగు కాల్వల్లో సిల్టులను తొలగించారు. అనంతరము కాఫీ విత్ క్లాప్ మిత్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులతో కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ, జాయింట్ కలెక్టర్ ఎ.శ్యాం ప్రసాద్, డిఆర్‌ఒ వినాయకం, డిపిఒ డాక్టర్ రమణయ్య, ఎంపిడిఒ వెంకటేశ్వర్లు, ఇఒపిఆర్‌డి విజరుకుమార్, పంచాయతీ అధికారి విజయ భాస్కర్‌రెడ్డి, పంచాయితీ కార్యదర్శి కెవిఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.