ప్రజాశక్తి - గుంటూరు : నగర ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని అందించేలా నగరపాలక సంస్థ ఖాళీ స్థలాల్లో పార్క్‌లను అభివృద్ధి చేసి, వాటి నిర్వహణలో స్థానికులను భాగస్వాములను చేయాలని ఇంజినీరింగ్ అధికారులను నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. గురువారం కమిషనర్ టీచర్స్ కాలని, ఇన్నర్ రింగ్ రోడ్‌లోని వైయస్సార్ పార్క్‌లు, గడ్డిపాడు, రెడ్డిపాలెం చెరువులను పరిశీలించారు. ఆయాచోట్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అన్నారు. నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాల్లో స్థానికులు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించేలా పార్క్‌లను అభివృద్ధి చేయడానికి వార్డ్ సచివాలయాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. నగరపాలక సంస్థ నుండి అభివృద్ధి చేసిన పార్క్‌ల నిర్వహణకు స్థానికుల భాగస్వామ్యం చేయాలన్నారు. పార్క్‌ల్లో ప్రదానంగా వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల ఆట వస్తువులు, పచ్చదనం పెంపు ఉండాలని, గుర్తించిన పార్క్‌ల్లో బాస్కెట్ బాల్, షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. పార్క్‌లో మరమ్మతుకు గురైన ఓపెన్ జిమ్, పిల్లల ఆట వస్తువులకు మరమ్మతులను వెంటనే చేపట్టాలని ఏఈలను ఆదేశించారు. చెరువుల అభివృద్ధిలో భాగంగా గడ్డిపాడు, రెడ్డిపాలెం చెరువుల అభివృద్ధికి ప్రతిపదనలు తయారు చేయాలన్నారు. పర్యటనలో ఇన్‌ఛార్జి ఎస్‌ఇ సుందర్రామిరెడ్డి, ఇఇ శ్రీనివాసరావు, ఎడిహెచ్ రామారావు, ఎసిపి అజరు కుమార్, డిఇఇలు శివకుమార్, శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఎస్‌లు సోమశేఖర్, రాంబాబు, టిపిఎస్ హృదయరాజు, ఎఇలు రాము, అనూష, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
పార్కుల పరిశీలనలో భాగంగా అధికారులు, సిబ్బందితో మాట్లాడుతున్న కమిషనర్










