Apr 25,2023 22:57

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్శిటీ
మలేరియా వ్యాప్తికి గల కారణాలపై అవగాహన కలిగి నివారణా చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మలేరియా శాఖ ఆధ్వర్యంలో పాత ప్రభుత్వ ఆసుపత్రి పద్ద నిర్వహించిన అవగాహనా ర్యాలీని మంగళవారం కలెక్టర్‌ డిల్లీరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మలేరియా వ్యాధి నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం అవసరం అన్నారు. మలేరియా వ్యాధి నివారణ చర్యలు ప్రతి ఇంటి నుండి ప్రారంభంకావాలన్నారు. మలేరియా వ్యాధి ప్రబలకుండా దోమల పెరుగుదలను అరికట్టాలన్నారు. ఇంటి పరిసరాల్లోని మురికి కాలువలో చెత్తా చెదారం నిల్వ ఉండకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మురికి నీరు ఎప్పుడూ పారేటట్లు చూడాలని ఇంటి పరిసరాలలో ఖాళీ టైర్లు, సీసాలు, కొబ్బరి బొండాలు తదితర పరికరాల్లో నీటి నిల్వ ఉండి దోమలు పెరుగుదలకు దోహదం చేస్తాయని పనికిరాని వస్తువులను తొలగించి నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకుంటే దోమల పెరుగుదలను అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.రామిరెడ్డి, డిఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం. సుహాసిని, జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ మోతీబాబు, డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ నళినీదేవి, ఎస్పిహెచ్‌వో డాక్టర్‌ నరసింహనాయక్‌ పాల్గొన్నారు. ప్రజాశక్తి-రెడ్డిగూడెం: ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్బంగా రెడ్డిగూడెం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం డాక్టర్‌ సందేశ్‌, డాక్టర్‌ చెన్నకేశవ ఆధ్యర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్‌ సందేశ్‌ మాట్లాడుతూ మలేరియా రహిత సమాజం కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ శ్యాంసుందరరావు, పిహెచ్‌ఎన్‌ లక్ష్మి, హెచ్‌వి భవాని, హెల్త్‌ అసిస్టెంట్‌లు సురేష్‌, నాగేశ్వరరావు, ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-వత్సవాయి: ఇంటి పరిసర ప్రాంతాలను ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంచుకోవాలని, మురికినీరు నిల్వ లేకుండా చూసుకోవాలని వత్సవాయి ప్రాథమిక వైద్యాధికారిని డాక్టర్‌ సుష్మా ప్రియదర్శిని అన్నారు. మంగళవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన వత్సవాయిలో ర్యాలీ నిర్వహించారు. దోమల వల్ల కలిగే నష్టాలు గురించి వివరించారు.