ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వ భరోసా..
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తోందని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. గురువారం నగరపాలక సంస్థ పరిధిలో గిరింపేట నగరపాలక ఉన్నత పాఠశాల ఆవరణంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే, మేయర్ ఎస్.అముద పరిశీలించారు. రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఐసీడీఎస్, డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన పౌష్టికాహార ప్రదర్శన స్టాల్స్‌లను సందర్శించారు. ఎమ్మెల్యే, మేయర్ మాట్లాడుతూ... కుటుంబంలో ప్రతిఒక్కరి ఆరోగ్యాన్ని దష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇంటింటికి వైద్యాన్ని తీసుకొచ్చారని, ఇంటి వద్దకే వచ్చి వైద్యపరీక్షలు చేస్తుండడం పేదలకు మేలు జరుగుతుందన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. వైద్య శిబిరంలో జగనన్న ఆరోగ్య సురక్ష కిట్లను పంపిణీ చేశారు. డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, సహాయ కమిషనర్ గోవర్థన్, ఎంహెచ్వో డాక్టర్ లోకేష్, సీఎంఎం గోపి, స్థానిక కార్పొరేటర్లు, వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు పాల్గొన్నారు.










