Sep 11,2023 00:53

దీక్షలో కూర్చున్న స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు కార్మికులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసే ప్రభుత్వాలకు తగిన గుణపాఠం తప్పదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలు ఆదివారం నాటికి 941వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్‌ ఐఎన్‌టియుసి కాంట్రాక్టు కార్మికులు కూర్చున్నారు. ఈ దీక్షలనుద్దేశించి పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ జరిగితే ముందుగా నష్టపోయేది కాంట్రాక్టు కార్మికులేనని తెలిపారు. ఉత్పత్తిలో కలిసి పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌ కార్మికులు ఈ పోరాటంలో ముందుండి ప్లాంటును కాపాడుకుంటున్నారని తెలిపారు. పాలకులు ప్రయివేట్‌, బడా కార్పొరేట్లకు ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెట్టే ప్రయత్నంలో కార్మిక వర్గాన్ని ఆందోళన దిశగా నేడుతున్నారని విమర్శించారు. ఉక్కు పరిశ్రమపై ఆధారపడిన లక్షలాదిమంది ప్రజలు ఆందోళన చెందుతుంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఉద్యమం ప్రారంభమై 941 రోజులు దాటుతున్నా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి చేయకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం కోసం మాట్లాడే నేతలు విశాఖ ఉక్కు పట్ల తమ వైఖరిని తెలపక పోవడం దురదృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇక్కడ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఆందోళనకరంగా ఉందన్నారు. ఈ ఏడాదైనా పూర్తి స్థాయిలో ఉత్పత్తి దిశగా ప్లాంటును నడవకపోతే స్థానిక యాజమాన్యానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టియుసికి చెందిన వివిధ విభాగాల కాంట్రాక్ట్‌ కార్మికులు కూర్చున్నారు.