Oct 24,2023 21:55

ప్రజాశక్తి - కడియం రాష్ట్ర ప్రజల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఎంఎల్‌ఎ, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. మండలంలోని వేమగిరి గ్రామంలో జరిగిన ''బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ'' కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ గోరంట్ల స్థానిక టిడిపి నేతలతో కలిసి ఇంటింటికి తిరిగి మినీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదవాడికి బతకడం భారంగా మారిందని, రాష్ట్రంలో ఉన్న అనేక సంపదలను జగన్‌ అండ్‌ కో టీమ్‌ దోచుకుంటుందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల కోసం అని ముఖ్యంగా మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించారని, తల్లికి వందనం, దీపం పథకం, ఉచిత బస్సు ప్రయాణం వంటివి కల్పించారని, యువతకు నిరుద్యోగ భృతిని ప్రవేశపెట్టారని గోరంట్ల అన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేసి, వైసిపి ప్రభుత్వం, నాయకులు రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు గుత్తుల కృష్ణ, రాష్ట్ర బిసి సెల్‌ ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ శ్రీనివాస్‌, తూర్పుగోదావరి జిల్లా బిసి సెల్‌ అధ్యక్షులు పితాని శివరామకృష్ణ, మచ్చేటి ప్రసాద్‌, బొల్లాడి జాన్‌, యనమదల గోవింద రాజు, పాల్గొన్నారు.