
ప్రజాశక్తి - నరసాపురం టౌన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక బస్‌స్టాండ్ సెంటర్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కవురు పెద్దిరాజు, పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో, ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ పేద సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారాలు మోపుతున్నాయన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు పొన్నాడ రాము, మంచిలి నీలకంఠం, నోముల కొండ, బోడసింగ్ అప్పారావు, తాడి నాగభూషణం, కొరాడ బద్రి, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పెనుగొండ : నిత్యావసర వస్తువుల టోకు మార్కెట్‌పై కేంద్ర ప్రభుత్వం పరిమితులు ఎత్తివేయడంతో ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్నాయని సిపిఎం మండల కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు చినమల్లం గ్రామ పంచాయతీ కార్యదర్శి నరసింహంకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ధరలను అదుపు చేసే శక్తి మోడీ ప్రభుత్వం కోల్పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న విద్యుత్తు ఛార్జీలను, ధరలను అదుపు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బందర్తి నరసింహమూర్తి, గుబ్బల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.