ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 14న అంబేద్కర్ జయంతి రోజు నుండి 30వ తేదీ వరకు సిపిఎం-సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు తెలిపారు. సోమవారం బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు అధ్యక్షతన ఆ పార్టీ జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. బాబూరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగిపోయాయన్నారు. ప్రజలకు ఉపాధి లేక జీవన పరిస్థితులు దిగజారుతున్నాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని, రైల్వేలు, టెలికం, ఎల్‌ఐసి, జిఐసి, విశాఖ ఉక్కు వంటి సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. సహజ వనరులను సైతం కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారన్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మరోసారి తీరని అన్యాయం జరిగిందని, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించలేదని గుర్తు చేశారు. ప్రజలకు ఉపాధి కల్పించే జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టానికి, కీలకమైన వ్యవసాయ రంగానికి, సంక్షేమ రంగానికి నిధులు కోత విధించారన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు విరుద్ధంగా, లౌకిక తత్వాన్ని మంటగలిపే చర్యలను చేపడుతుందని మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ కేంద్రం బాటలోనే రాష్ట్ర ప్రభుత్వమూ నడుస్తోందని, ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉద్యమకారుల గొంతు నులిమే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఆస్తిపన్ను పెంపు, చెత్తపన్ను వసూలు చేయడం, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే చర్యలను వ్యతిరేకించాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజి, ఎన్.భావన్నారాయణ, ఎం.రవి, ఎస్‌ఎస్.చెంగయ్య, కె.నళినీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు బి.కోటేశ్వరి, ఎల్.అరుణ, ఎంఎ.చిస్టీ, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.










