Sep 04,2023 20:11

ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు
ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాలు
-సమరభేరీ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌
-విఆర్‌సి క్రీడా మైదానం నుంచి ప్రదర్శన
-కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
ప్రజాశక్తి-నెల్లూరు:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి మరీ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని, సంస్కరణల పేరుతో ప్రజలపై రెండు ప్రభుత్వాలు భారాలు మోపడం సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ అన్నారు. సోమవారం ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం నగర, రూరల్‌ కమిటీలు సంయుక్తంగా సమరభేరీ కార్యక్రమం నిర్వహించాయి. కేంద్ర, రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు నగర, రూరల్‌ నియోజకవర్గాల్లో సిపిఎం బృందాలు ఇంటింటిని సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకొని వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించడంతోపాటు సంతకాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించింది.
అనంతరం సచివాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సచివాలయ అడ్మిన్లుకు వినతిపత్రాలను అందజేసింది. అయినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం నుంచి స్పందన కనిపించకపోవడంతో విఆర్‌సి క్రీడా మైదానం నుంచి నగర, రూరల్‌ నియోజకవర్గ ప్రజలతో కలిసి మహాప్రదర్శనగా కలెక్టర్‌ కార్యాలయం చేరుకొని అనంతరం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ముందుగా సిపిఎం రూరల్‌ కమిటీ ఆధ్వర్యంలో రూరల్‌ నియోజకవర్గ డివిజన్లకు చెందిన ప్రజానీకంతో ఏసి కూరగాయల మార్కెట్‌ ప్రాంతం నుంచి భారీ ర్యాలీగా విఆర్‌ క్రీడా మైదానానికి చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతంలో సిద్దంగా ఉన్న నగర, కోవూరు నియోజకవర్గ ప్రజలతో ఆయా ప్రాంతాల్లో నెలకొని ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మహాప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌ వద్దధర్నా చేపట్టారు.ఈ ధర్నానిద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ మాట్లాడుతూ విద్యుత్తు సంస్కరణల పేరుతో విద్యుత్‌ ఛార్జీలు ప్రభుత్వాలు విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాలు మోపుతుందన్నారు. అంతటితో ఆగకుండా 2014 నుంచి 19 వరకు 2020 నుంచి 23 వరకు ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో, ట్రూ ఆఫ్‌ చార్జీలు పేరుతో ప్రజలపై అధనంగా రూ. 5983 కోట్ల కేంద్ర బిజెపి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై తీవ్రమైనటువంటి భారాల మోపిందన్నారు. మరోవైపు పెరిగిన కరెంట్‌ చార్జీలను సాకుగా చూపి ప్రభుత్వం అందజేస్తున్న వద్ధాప్య పెన్షన్‌, వితంతు పెన్షన్‌ వికలాంగుల పెన్షన్‌ అమ్మఒడి, విద్యా దీవెన, వాహన మిత్ర తదితర సంక్షేమ పథకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం తొలగించివేయడం దుర్మార్గమన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ అయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టినా పెట్రోల్‌ డీజిల్‌ గ్యాస్‌ ధరలు అమాంతంగా పెంచివేసిందన్నారు. ఈ రేట్లు పెరగటంతో నిత్యవసర సరుకు ధరలు ఆకాశమే హద్దుగా రోజు రోజుకు పెరిగడంతో ప్రజలు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందులెదుర్కొంటున్నారన్నరు. ఇప్పటికైనా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే ప్రజలపై సంస్కరణల పేరుతో మోపుతున్న ఆర్దిక భారాల నుంచి విముక్తి కలగించాలని సిపిఎం డిమాండ్‌ చేస్తుందన్నారు. సిపిఎం జిల్లా సెక్రటేరియట్‌ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు , ఎం.మోహన్‌రావులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం షరతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్ను ,నీళ్ల పన్ను ,చివరికి చెత్త పన్ను, బస్సు చార్జీలు ,మద్యం రేట్లు తదితర అన్ని వస్తువుల ధరలు పెంచి ప్రజలపై తీవ్రమైనటువంటి భారాలను మోపడం సరికాదన్నారు. రానున్న ఎన్నికల్లో ఇటువంటి ప్రభుత్వాలకు ప్రజల తమ ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పి ఇంటికి పంపించాలని పిలుపు నిచ్చారు. సిపిఎం నగర రూరల్‌ కార్యదర్శులు కత్తి శ్రీనివాసులు, బత్తల కష్ణయ్య, రూరల్‌ మండలం కార్యదర్శి ఆలూరు తిరుపాలు మాట్లాడుతూ ప్రజలు త్రాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ప్రభుత్వాలు సరఫరా చేయలేని స్థితిలో పాలన సాగుతుందన్నారు. నగర, రూరల్‌ నియోజకవర్గాల్లో రోడ్లన్నీ కూడా మనుషులు, వాహనాలు నడవలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. సైడ్‌ కాలవలు నిర్మించక మురికి నీరు ఎక్కడ చూసినా నిలబడి ఉన్నదని, దోమలకు మందు కూడా కొట్టకుండా ఉన్నందునప్రజలను విష జ్వరాల భారీ నా పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చేతకాని పాలన వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఇదిలా ఉంటే అనేక సంవత్సరాల నుంచి కాపురాలు ఉంటున్నప్పటికీ రూరల్‌ ,నగరం లలో ఇంటిపట్టాలు పేద ప్రజలకు ఇవ్వడం లేదనీ,టిడ్ట్కో ఇల్లు గత ఐదు సంవత్సరాల క్రితం పూర్తయిన గాని లబ్ధిదారులకు అప్పజెప్పడం లేదన్నారు. జిల్లాలో జగనన్న ఇల్లు నిర్మాణాలు నాసిరకంగా సాగుతున్నాయని,ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇల్లు కట్టుకునేందుకు వారి అకౌంట్లో నేరుగా వేయాలని డిమాండ్‌ చేశారు. మహిళా సంఘం నాయకురాలు ఎస్‌కె మస్తాన్‌భీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైల్వే లను, విమానాశ్రయాలను, పో ర్టులను ,గనులను, అడవులను, నదులన్నిటిని అంబానీ ,అదాని ,టాటా, బిర్లా లాంటి బడా కార్పొరేట్‌ శక్తులకు కేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం కట్టబెట్టుతుందన్నారు. ఒక పథకం ప్రకారం ప్రభుత్వ సంస్థలన్నింటినీ కేంద్రం ధ్వంసం చేస్తున్నది. దేశంలో ఉన్న సంపద అంతా కార్పొరేట్‌ శక్తులకు అప్ప చెప్పినందువల్ల ప్రభుత్వసంస్థలలో పని చేస్తున్న ఉద్యోగస్తులు వీధులు పాలౌతున్నారన్నారు. మరోవైపు నిరుద్యోగ సమస్య ,పేదరిక సమస్య తీవ్రమైతే వాటిని పట్టించుకొకుండా జమిలీ ఎన్నికల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుందన్నారు. అదే విధంగా ఉమ్మడి పౌరసత్వ బిల్లు పేరుతో మరోసారి బిజెపి అధికారానికి రావాలని అనేక కుట్రలు చేస్తున్నదని, అదే విధంగా గ్యాస్‌ సిలిండర్‌ రేటును రూ.200 తగ్గించడం ఎన్నికల జిమిక్కుల్లో ఒకటిగా అభివర్ణించారు.ఈ కుట్రలన్నీ తిప్పుకొట్టాలని,ఇటువంటి కేంద్ర బిజెపి మోడీ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని, బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు మద్దిస్తున్న రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలనిపిలుపునిచ్చారు. అనంతరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కూర్మ నాథ్‌కి ప్రజా సమస్యలపై తీసుకొచ్చిన అర్జీలను అందజేశారు. అర్జీలను పరిశీలించి సమస్యలన్నీ పరిష్కరిస్తామని జాయింట్‌ కలెక్టర్‌ సిపిఎం నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి అబ్దుల్‌ అజీజ్‌, రూరల్‌ సెక్రటేరియట్‌ సభ్యులు కొండా ప్రసాద్‌ , కిన్నెర కుమార్‌ , పార్టీ రూరల్‌ కమిటీ సభ్యులు ఎస్‌.కె షాహినావేగం ఎస్‌.కె ఖలీల్‌, ఎస్‌ కే శంషాద్‌, ఎం సుధాకర్‌, శాఖా కార్యదర్శులు ఓ సుధీర్‌, ఎస్‌ కే శాన్వాస్‌, జయ ప్రకాష్‌, ఆర్‌ వి రావు కే కామయ్య, సిపిఎం నగర సెక్రటేరియట్‌ సభ్యులు జి నాగేశ్వరావు , శ్రీనివాసులు , కోవూరు మండల కార్యదర్శి శ్రీనివాసులు, గండవరం శ్రీనివాసులు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నలగడ్డ వెంకమ రాజు, వెంకటాచలం మండల కార్యదర్శి వెంకట కష్ణయ్య ,ఆటో కార్మిక సంఘం రూరల్‌ అధ్యక్షులు కె శాంసన్‌, సిపిఎం నాయకులు, కార్యకర్తలు,ఆటో కార్మికులు, హమాలీ కార్మికులు. సిఐటియు,డివైఎఫ్‌ఐ మహిళా సంఘం ఆవాజ్‌ తదితర సంఘాల నుండి వందలాది మంది ర్యాలీ ధర్నాలు పాల్గొన్నారు.