Oct 09,2023 00:09

ప్రజాశక్తి-కాకినాడ దేశంలో ప్రజాస్వామ్యంపై బిజెపి దాడి చేస్తోందని దానికి వైసిపి, టిడిపి, జనసేన వంతపాడుతున్నాయని సిపిఎం కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ విమర్శించారు. ఆదివారం సిపిఎం జిల్లా విస్తత సమావేశం కాకినాడ సుందరయ్య భవన్‌లో కెఎస్‌.శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహిరంచారు. ఈ సందర్బంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ పత్రికా స్వేచ్చపై బిజెపి దాడి పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎవరైనా వార్తలు రాస్తే వారిపైన ఇడి దాడులు పెరిగిపోతున్నాయన్నారు. న్యూస్‌ క్లిక్‌ పైన దాడి చేయడం ఈ కోణంలోదేనని అన్నారు. రాష్ట్రాల హక్కులను బిజెపి హరించేస్తున్నా రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు పట్టించు కోకుండా బిజెపితో దోస్తీ చేస్తున్నాయన్నారు. ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయ విధానాన్ని రూపొందించాల్సిన భాధ్యత కమ్యూనిస్టులపై ఉందని తెలిపారు. సిపిఎం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రంగాలలోనూ తన రాజకీయ విధానాన్ని తెలుపుతూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయంపై రాష్ట్రవ్యాపితంగా ప్రచారం నిర్వహిస్తున్నామని జిల్లాలో అన్ని మండలాల్లోనూ యాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో కరణం ప్రసాదరావు, జి.బేబిరాణి, టేకుమూడి ఈశ్వరరావు, నీలపాల సూరిబాబు, సిహెచ్‌.రాజ్‌కుమార్‌, వి.రాజుబాబు, కె.సింహాచలం పాల్గొన్నారు.