Sep 12,2021 06:44

     'ప్రజల చేత ఏర్పాటు చేయబడి, ప్రజల కొరకు పనిచేసే ప్రజా ప్రభుత్వమే ప్రజాస్వామ్యం' అంటాడు అబ్రహాం లింకన్‌. మనది సర్వస్వతంత్ర దేశం. 'లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక, ప్రజాస్వామిక'మని మన రాజ్యాంగంలో మనమే చెప్పుకున్నాం. సమాజంలోని ప్రతి ఒక్కరూ సమానమని, అందరికీ సమానమైన స్వేచ్ఛ, హక్కులు వుండాలని రాసుకున్నాం. వ్యక్తులు లేనిదే సమాజం లేదు. సమాజంలో అంతర్భాగం కాకుండా ఏ వ్యక్తీ విడిగా మనుగడ సాగించనూలేడు. అందుకే 'అందరి కోసం ఒక్కడు నిలిచి, ఒక్కని కోసం అందరు కలిసి, సహకారమే మన వైఖరి అయితే, ఉపకారమే మన ఊపిరి అయితే... పేద, గొప్పా భేదం పోయి అందరూ నీది, నాదను వాదం మాని వుందురూ' అన్నాడు ఓ సినీకవి.
     ఎంత ప్రజాస్వామ్య దేశంలోనైనా నూటికి నూరుశాతం ఏకాభిప్రాయాన్ని ఆశించలేం. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి అందరూ అమలు చేయడం ప్రజాస్వామ్యంలో అనుసరించాల్సిన పద్ధతి. ఈ సూత్రాన్నే వక్రీకరిస్తోంది బిజెపి. మెజారిటీ 'ప్రజల' స్థానంలో... మెజారిటీ 'మతస్తుల' అభిప్రాయం నెగ్గాల్సిందేనని, ఇదే సిసలైన ప్రజాస్వామ్యమని అంటోంది. ఈ వాదన రెండు రకాలుగా తప్పు. పలు మతాలున్న దేశంలో, మతస్వేచ్ఛ గ్యారంటీ చేసిన నేపథ్యంలో మెజారిటీ మతస్తుల మాటే నెగ్గాలంటే శాశ్వతంగా మైనారిటీ మతస్తులు రెండవ తరగతి పౌరులుగా, సమాన హక్కులు లేకుండా ఉండడమే. రెండవం అంశం: హిందువుల అభిప్రాయం ఏమిటన్నది మాత్రం ఏ విధంగా నిర్ణయిస్తారు? హిందువులంతా ఏకాభిప్రాయంతోటే వుంటారా? అది సాధ్యమా? అంటే ఆచరణలో మతం పేరు చెప్పి, ఆచారాలు, కట్టుబాట్ల పేరుతో కొద్దిమంది పెత్తనాన్నే ఆ మతస్తులందరి మీదా రుద్దడం జరుగుతుంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో మొదలైనది ఈ తరహా రాజ్యమే. ఇక్కడా అటువంటిది రావాలన్నదే 'హిందుత్వ' శక్తుల వాదన. కనుక ప్రజాస్వామ్య యుతంగా ప్రభుత్వ పాలన సాగాలంటే, అది లౌకిక ప్రాతిపదికన మాత్రమే సాధ్యం. మత ప్రాతిపదికన కాదు. హిందుత్వ వాదులు మైనారిటీలను ఇతరులుగా, పరాయివారుగా చిత్రీకరించి, దేశంలో నియంతృత్వాన్ని అమలు చేస్తున్నారు.
వాస్తవానికి దేశంలో వ్యవసాయం మీద ఆధారపడిన వారిది మెజారిటీ సంఖ్య. రైతులు, కూలీలు, కులం, మతం, ప్రాంతం ప్రసక్తి లేకుండా అందరూ మోడీ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద మోడీకి గౌరవం వుంటే, ఇప్పటికే ఆ చట్టాలను రద్దు చేసి వుండాల్సింది. అలా చేయలేదు. కాని ప్రజాస్వామ్య మంత్రం జపిస్తున్నారు. ఇంతకన్నా మోసం వుంటుందా? కొద్దిమంది గోగూండాలు చేసే దాడులను సాకుగా చూపించి, అదే మెజారిటీ ప్రజల అభిప్రాయం అంటూ గోవధ నిషేధ చట్టాలను చేస్తున్నారు. ఈ దేశం రాష్ట్రాల సమాఖ్య. అంటే... వివిధ రాష్ట్రాలు స్వచ్ఛందంగా కలిసి దేశంగా ఏర్పడ్డాయి. ఏ రాష్ట్రం యొక్క హోదానూ రద్దు చేసే అధికారం కేంద్రానికి లేదు. కానీ, జమ్ముకాశ్మీర్‌ రాష్ట్ర హోదాను ఏకపక్షంగా, కాశ్మీర్‌ ప్రజల ఆమోదం లేకుండా, కేవలం గవర్నర్‌ సంతకం తీసుకుని రద్దు చేసేశారు. ఇది నియంతృత్వమేగాని ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? కాని మోడీ మెజారిటీ ప్రజల మనోభావాల ప్రకారం చేసినట్టు ప్రచారం చేసుకున్నారు.
      ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భావించే భారతదేశంలో ప్రజాస్వామ్యం దారుణంగా నలిగిపోతోంది. 'ది ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌' ప్రచురించిన ప్రజాస్వామ్య సూచీలో భారత్‌ 53వ స్థానానికి పడిపోయింది. 2014లో 27వ స్థానంలో వున్న భారత్‌లో... ఈ ఏడేళ్ల కాలంలో ప్రజాస్వామ్యం సగానికి సగం పడిపోవడం ఆందోళనకరం. దేశ సమైక్యతను విచ్ఛిన్నం చేసి, మత రాజ్య స్థాపనకు బరితెగించిన బిజెపి... ప్రజాస్వామ్యాన్ని, లౌకికతత్వాన్ని, మత స్వేచ్ఛనీ హరిస్తున్నది. వ్యక్తుల పైనా, సంస్థల పైనా, పార్టీల పైనా, మేధావులు, జర్నలిస్టులపైనా అణచివేతకు పాల్పడుతున్నది. చివరకు రాష్ట్రాల హక్కులను, వనరులను సైతం బలవంతంగా గుంజుకుంటోంది. అప్పనంగా కార్పొరేట్లకు అప్పజెబుతోంది. ప్రజలందరినీ ప్రేక్షకులను చేసి... అంబానీలు, అదానిలు మాత్రమే సంపద సృష్టికర్తలని అనుకుంటే... అది ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కాదు. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రజలే ప్రభువులు. కానీ, భారత ప్రజలు... మా చేతుల్లో ఏమీలేదనే నిస్సహాయతలో వున్నారు. 'మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకు దేవుడి మీద కానీ, మహానుభావుల మీద కానీ ఆధారపడొద్దు' అంటాడు అంబేద్కర్‌. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి అతి పెద్ద ప్రమాదం... కార్పొరేట్‌ రాజకీయం, దాన్ని కాపాడుతోన్న మతతత్వ రాజకీయం. మనకు కావాలనుకున్నది సాధించుకునే దిశగా ప్రజలు కదలాలి. సిసలైన నవ భారతాన్ని నిర్మించుకొనే కృషిలో భాగస్వాములు కావాలి. అదీ ప్రజాస్వామ్యం. అప్పుడే 'ప్రజాస్వామ్య దినోత్సవం' వర్థిల్లుతుంది.