Jul 18,2021 12:31

దేశంలో అస్త్ర సన్యాసం చేసిన ప్రజాస్వామ్యం
ఆసుపత్రి బెడ్డు మీద
అనిస్తీషియా ఇచ్చిన రోగిలా అపస్మారక స్థితిలో
అత్యవసర శస్త్ర చికిత్సకై ఆరాటపడుతున్నది

ఆయుష్షుకు గ్యారంటీ లేకున్న
ఆపరేషన్‌ సక్సెస్‌ అన్నట్లుగా
ఐదేండ్లకోసారి ఆనవాయితీగా జరిగే అక్రమార్కుల
అరా(చ)జకీయంలో
కమ్ముకున్న కరెన్సీ మేఘాల్లో
కురిసిన ఓట్ల కుంభవృష్టికి
కుదేలైన సామాన్యుని
బతుకు చిత్రం..
కళ్ళ ముందు స్పష్టంగా.. నగంగా...

మాటలు రాని మౌన ఘోషలో
జడలు విప్పుతున్న జాడ్యాలు
కుత్తుకలపై కత్తిలా దిగబడుతున్న
మంద్ర స్థాయి యుద్ధంలో..
మనిషితత్వం అడుగంటి
మరింత అగాధంలోకి..

శాంతి కపోతం రెక్కలు విరిచి
పాడుతున్న స్వేచ్ఛాగీతం
పరిమళం లేని పువ్వులా పరిహాసమవుతున్నది

ఎండిన చేలపై విరుచుకు పడుతున్న మండుటెండల్లా
అలసిన గుండెలపై చెలరేగే అధికార మదాంధం
హద్దులు మీరుతూ..
మృత్యు గీతం వినిపిస్తున్నది

భూ తల్లి సిగలో మెరుస్తున్న నగలపై
కండ్లేసిన మేక వన్నె పులులు
పరుచుకున్న పచ్చదనంపై పంజా విసురుతున్నారు

అన్నంలేని అభాగ్యులకు
ఆసరాగుండాల్సిన వ్యవస్థలు
పెట్టుబడి పెనుభూతాలైన కార్పొరేట్‌ కౌగిల్లో చిక్కి
వెన్ను విరిగి వెర్రి చూపులు చూస్తున్నారు

పత్రహరితం కోల్పోయిన ప్రశ్నల మొలకలు
బురద నీరులో దొర్లుతూ
బుద్ధిగా మసులుకుంటున్నరు

పరాధీనతే ప్రాణవాయువైన
దళారీ ధనికస్వామ్యంలో
ఊపిరాడని ప్రజాస్వామ్యానికి ఊతమిచ్చేదెప్పుడో!
 

గన్‌రెడ్డి ఆదిరెడ్డి
94947 89731