
న్యూఢిల్లీ : ప్రభుత్వాధికారులతో నేరుగా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కోవిడ్‌పై సమావేశం నిర్వహించడాన్ని ఢిల్లీ ప్రభుత్వం తప్పుపట్టింది. 'ఎన్నికైన ప్రభుత్వాన్ని బేఖాతరు చేస్తూ ఇటువంటి సమావేశాలను నిర్వహించడం రాజ్యాంగ, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలు మమల్ని ఎన్నుకున్నారు. మీకెమైనా సందేహాలుంటే మా మంత్రులను అడగండి. అధికారులతో నేరుగా సమావేశాలు నిర్వహించడం ఆపండి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి... సర్' అని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కోవిడ్ పరిస్థితులపై అధికారులతో లెఫ్టినెంట్ గవర్నర్ సమావేశంతో కూడిన ఫొటోలను ఆయన కార్యాలయం ట్వీట్ చేయగా.. కేజ్రీవాల్ ఈవిధంగా సమాధానం ఇచ్చారు. దేశ రాజధానిలో గవర్నర్‌కు మరిన్ని అధికారాలు అప్పజేప్పే గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (జిఎన్‌సిటిడి) చట్టాన్ని ఈ ఏడాది పార్లమెంట్‌లో ఆమోదం పొందగా... దీనిపై కేజ్రీవాల్ ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఢిల్లీలో 2013లో ఆప్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య విభేదాలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ చట్టం ఢిల్లీ ప్రజలను అవమానించడమేనని అన్నారు.