ప్రజాశక్తి-బాపట్ల: ప్రమాదంలో ఉన్న భారత దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీసేందుకు ప్రతి ఒక్కరూ కదలి రావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి రమాదేవి పిలుపునిచ్చారు. సోమవారం సిపిఎం, సిపిఐ సంయుక్త ఆధ్వర్యంలో కేంద్రంలో ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాద బిజెపిని సాగనంపుదాం.. దేశాన్ని కాపాడుకుందాం.. నినాదంతో బాపట్ల పట్టణంలో ప్రచార భేరి నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ దేశ సంపదను ఆదానీ వంటి కార్పొరేట్లకు ప్రభుత్వ సంస్థలను కట్టబెట్టేందుకు నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారన్నారు. ప్రధాని మోడి పన్నాగాలను తిప్పి కొట్టేందుకు ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎదురుకానుందన్నారు. దేశ సంపదను కళ్ల ముందే ఆదాని వంటి బడా బాబుల సంస్థలకు కట్టబెడుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. దీన్ని ప్రతిఘటించాలన్నారు. ప్రకృతి సంపదను దోచుకుంటూ మానవ నిర్మిత విశాఖ ఉక్కును ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు మోడీ కుట్ర పన్నుతున్నారన్నారు. ఈ నెల 14న ప్రారంభమైన ప్రచార భేరీ 30వ తేదీ వరకు జరిగే ప్రచారంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని మోడీని సాగనంపే వరకు పోరాటం కొనసాగించాలని అన్నారు. బాపట్ల పాత బస్టాండ్ నుంచి ఆరంభమైన ప్రచార భేరి తవ్వకాలువ నుంచి అంబేద్కర్ సర్కిల్, రథం బజారు ద్వారా తిరిగి ఎన్జీవో హౌంకు చేరింది. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు టి కృష్ణమోహన్, పార్టీ సీనియర్ నాయకులు నూతలపాటి కోటేశ్వరరావు, వై భాస్కరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి సింగరకొండ, పార్టీ సీనియర్ నాయకులు జెబి శ్రీధర్, వామపక్షాల నాయకులు పాల్గొన్నారు.










