Sep 10,2021 06:24

     త్రిపుర రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం కార్యాలయాలపై బిజెపి అరాచక మూకలు దాడులకు పాల్పడడం, వాహనాలకు నిప్పు పెట్టడం అత్యంత హేయమైన చర్య. దేశర్‌ కథ, ప్రతివాది కలమ్‌ దిన పత్రికలు, పిఎన్‌-24 న్యూస్‌ ఛానెల్‌ కార్యాలయాల పైన, అనేకమంది జర్నలిస్టులపై సైతం దాడికి తెగబడడం దారుణం. సిపిఎం నేతల ఇళ్లపై దాడులు చేసి విధ్వంసం గావించడం, వారిని వారి కుటుంబ సభ్యులను బెదిరించడం వంటి చర్యలతో భయానక పరిస్థితి సృష్టించారు. అన్ని జిల్లాల్లో ఒకే రోజున పథకం ప్రకారమే దాడులకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీపై, మీడియా పైన అధికార పార్టీ ఇంత దుర్మార్గమైన దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారింది. బిజెపి మూకలు పేట్రేగిపోతుంటే పోలీసులు, పారా మిలటరీ బలగాలు ప్రేక్షక పాత్ర వహించడం గర్హనీయం. సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యాలయం వద్ద పహారా కాస్తున్న సిఆర్‌పి దళాలను దాడులు జరగడానికి గంట ముందు ఉపసంహరించారు. ఈ దాడులు, ఎడతెగని విధ్వంసకాండ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, భాగస్వామ్యంతోనే జరిగాయని స్పష్టమవుతోంది.
      అరాచక శక్తుల దాడిలో త్రిపుర రాష్ట్ర మొదటి గిరిజన ముఖ్యమంత్రి, ప్రజల ప్రియతమ నాయకుడైన దశరథ్‌ దేవ్‌ విగ్రహం కూడా దెబ్బతింది. ఆ సరిహద్దు రాష్ట్రంలో గిరిజన, గిరిజనేతర ప్రజల మధ్య సఖ్యత కోసం అహరహం కృషి చేసిన నేత దశరథ్‌ దేవ్‌. ఇటు త్రిపుర మహారాజు దోపిడీ, దౌర్జన్యాలకు, అటు బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి సాగిన పోరాటంలో ప్రముఖ పాత్ర నిర్వహించిన ఆ మహానాయకుని విగ్రహానికి అపచారం చేయడమంటే ఈ మూకలు ఏం కోరుకుంటున్నాయో, ఏ శక్తుల కొమ్ము కాస్తున్నాయో స్పష్టమే !
     ఏదైనా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా దిగజారితే కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకొని చక్కదిద్దాలి. ప్రజలు, రాజకీయ పార్టీలు తమ తమ కార్యకలాపాలను శాంతియతంగా నిరాటంకంగా కొనసాగించుకునేలా చర్యలు చేపట్టాలి. కాని కేంద్ర హోం మంత్రి ప్రియ శిష్యుడే త్రిపుర ముఖ్యమంత్రిగా ఈ దారుణాలకు బాధ్యుడైనపుడు అది జరుగుతుందా అన్నది సందేహం ఎవరికైనా కలుగుతుంది. సున్నితమైన సరిహద్దు రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రధానమంత్రి జోక్యం చేసుకోవడం అవసరం. అయితే ఈ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందా అన్నది సందేహమే !
     కోవిడ్‌ కట్టడికి తగు చర్యలు తీసుకోవాలని, బాధితులను ఆదుకోవాలని, ఇతర ప్రజాసమస్యల పరిష్కారం కోరుతూ ఇటీవల సిపిఎం నిర్వహించిన ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో సహించలేని బిజెపి ఒక పథకం ప్రకారం దాడులకు తెగబడిందన్నది నిర్వివాదాంశం. త్రిపురలో ప్రధాన ప్రతిపక్షంగా వున్న పార్టీని ఏదో ఒక రకంగా బెదిరించి, నోరు మూయించాలని బిజెపి చూస్తోంది కాని ఇటువంటి దాడులకు తాము బెదిరేది లేదని కమ్యూనిస్టులు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి తీవ్ర హాని కలిగించే ఇలాంటి దాడులను అన్ని రాజకీయ పార్టీలు, సకల ప్రజాతంత్ర శక్తులూ ఖండించాలి. ఇది కేవలం త్రిపురకు మాత్రమే పరిమితం కాదు. యావద్దేశానికీ పాకే ప్రమాదముంది. ఉత్తరాన కాశ్మీర్‌ ప్రజలపై ఏడాది కాలంగా కేంద్ర ప్రభుత్వం నిర్బంధ కాండను కొనసాగిస్తోంది. రైతు ఉద్యమం దాదాపు పది నెలలుగా అత్యంత శాంతియుతంగా సాగుతుంటే వారి మీద పోలీసుల హింసను ప్రేరేపించింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో గో గూండాల దాడులు అధికార పక్షం ప్రోత్సాహం తోనే సాగుతున్నాయి. ఇప్పుడు ఈశాన్య ప్రాంతానికీ ఈ నయా ఫాసిస్టు దమనకాండ విస్తరిస్తోంది. ప్రజల దైనందిన సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం బయటపడుతున్నకొద్దీ దాన్ని కప్పిపుచ్చుకుంటూ ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించే ఈ తరహా కుట్రలకు బిజెపి తెగబడుతోంది. ఈ దౌర్జన్యపూరిత విధానాలను ప్రతిఘటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా పురోగామి శక్తులంతా కదలాల్సిన సమయం వచ్చింది.