ప్రజాశక్తి - ములగాడ : భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి మాతృక వంటిదని సెయింట్ ఆన్స్ కళాశాల రాజనీతి శాస్త్ర అధ్యాపకులు ఇపిఎస్.భాగ్యలక్ష్మి అన్నారు. సెయింట్ ఆన్స్ కళాశాలలో రెండు రోజులుగా రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యాన జరుగుతున్న రాజ్యాంగ శిక్షణా తరగతులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. సార్వజనీన వయోజన ఓటు హక్కు, బహు పార్టీ వ్యవస్థ, రాజకీయ హక్కులు, సమన్యాయ పాలన, స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ, సమిష్టి బాధ్యతతో పనిచేసే మంత్రివర్గం, దేశభక్తి, అంకితభావం గల సైనిక వ్యవస్థ భారత ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి తలమానికంగా తీర్చిదిద్దుతున్నాయని చెప్పారు. అందుకే భారత ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య మాతృక అంటారని తెలిపారు. రాజనీతి, పాలనా శాస్త్ర అధ్యాపకులు అనసూయాదేవి మాట్లాడుతూ, ప్రజల నిరంతర చైతన్యమే ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును బాధ్యతగా ఉపయోగించుకోవాలని కోరారు. సరైన నాయకులను ఎన్నుకొని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థినులకు రాజ్యాంగంపై వివిధ పోటీలను నిర్వహించారు. వారికి ప్రశంసా పత్రాలను, బహుమతులను అందించారు. నిర్వాహకులను, విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ ప్రేమకుమారి అభినందించారు.










