అంగన్‌వాడీలపై ప్రభుత్వ దమనకాండ
చలో విజయవాడకు వెళ్లనీయకుండా తీవ్ర నిర్బంధం, అరెస్టులు
కలపర్రు టోల్‌గేట్ వద్ద అడ్డుకుని పోలీస్‌స్టేషన్లకు తరలింపు
నిరసనలతో హోరెత్తిన పోలీసు స్టేషన్లు
ఏలూరులోని కల్యాణ మండపంలో గేట్లు వేసి నిర్బంధకాండ
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
అంగన్వాడీలపై ప్రభుత్వం సాగించిన నిర్బంధకాండ చూసి మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా.. లేక రాచరిక పాలనలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుంది. ప్రజల హక్కులను కాలరాస్తూ వైసిపి ప్రభుత్వం నిరంకుశ ధోరణిలో ముందుకు సాగుతోంది. వాహనాల్లో వెళ్తున్న వివిధ జిల్లాలకు చెందిన అంగన్‌వాడీలను ఏలూరు కలపర్రు టోల్‌గేట్ వద్ద అడ్డగించిన పోలీసులు తీవ్ర నిర్బంధం ప్రయోగించారు. తూర్పుగోదావరి, విశాఖతోపాటు జిల్లాలోని పలు మండలాలకు చెందిన అంగన్‌వాడీలను విజయవాడ వెళ్లకుండా అడ్డుకుని పోలీస్‌స్టేషన్లకు తరలించి నిర్బంధించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడుగంటల వరకూ టిఫిన్, తాగునీరు లేక, పోలీస్‌స్టేషన్ల వద్ద మరుగుదొడ్లు వంటివి లేక అంగన్‌వాడీలు పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతం. జిల్లాతోపాటు వివిధ జిల్లాలకు చెందిన అంగన్‌వాడీలను కలపర్రు టోల్‌గేట్ వద్ద అడ్డుకుని పెదపాడు, ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరిన సిఐటియు నాయకులు అంగన్‌వాడీలతో కలిసి పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. దీంతో ఏలూరు వన్‌టౌన్ పెరుగుచెట్టు సమీపంలోని శ్రీ సీతారామ భర్తియా కల్యాణ మండపంలో దాదాపు 150 మంది అంగన్‌వాడీలను నిర్బంధించి గేట్లు మూసివేశారు. దీంతో నిర్బంధించిన అంగన్‌వాడీలను విడుదల చేయాలని సిఐటియు నాయకులు ఆర్.లింగరాజు, బి.సోమయ్యతోపాటు పలువురు నాయకులు అక్కడకు చేరుకుని రోడ్డుపై పడుకుని నిరసన చేపట్టారు. సిఎం డౌన్‌డౌన్ అంటూ అంగన్‌వాడీలు చేసిన నినాదాలు హోరెత్తాయి. సచివాలయ మహిళా పోలీసులను రంగంలోకి దించి అంగన్‌వాడీలపై తీవ్ర నిర్బంధం ప్రయోగించిన పరిస్థితి ఉంది. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, పెదపాడు, నూజివీడు, ఉంగుటూరు, భీమవరం, తణుకు, పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల్లో అంగన్‌వాడీలపై తీవ్ర నిర్బంధకాండ సాగింది. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం కంటే అదనంగా రూ.వెయ్యి వేతనం ఇస్తామని చెప్పిన వైసిపి నాలుగేళ్లయినా ఆ ఊసే మరిచిపోయింది. కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ అందించాలని, ఫేస్‌యాప్ రద్దు చేయాలని, జీతాలు, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్లతో చలో విజయవాడకు అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న అంగన్‌వాడీలను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. గతంలో టిడిపి ప్రభుత్వ హాయాంలోనూ ఇదేవిధంగా అంగన్‌వాడీలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. అదే టిడిపి పతనానికి కారణమైంది. ఇప్పుడు వైసిపి సైతం అదేబాటలో పయనిస్తోంది. తమ హక్కులపై గళం విప్పుతున్న ఉద్యోగులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశమైంది.










