పంజాబ్ వర్సిటీ విశ్రాంత ఎకనమిక్స్ ప్రొఫెసర్ బల్వీందర్‌సింగ్ తివానా
గీతంలో ముగిసిన ఐపిఇఎ 26వ వార్షిక సమావేశాలు
ప్రజాశక్తి- మధురవాడ : ప్రజాస్వామ్యంలోని వ్యవస్థల న్నింటినీ నిర్వీర్యం చేసేలా ధన వినియోగం కీలక పాత్ర వహిస్తుండటం విచారకరమని పంజాబ్ విశ్వవిద్యాలయం ఆర్ధిక శాస్త్ర విభాగం విశ్రాంత ప్రొఫెసర్ బల్వీందర్ సింగ్ తివానా ఆవేదన వ్యక్తం చేశారు.. ఎపి ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ సంయుక్తం ఆధ్వర్యాన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వేదికగా రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఇండియన్ పొలిటికల్ ఎకానమీ అసోసియేషన్ (ఐపిఇఎ) 26వ వార్షిక సమావేశాలు శనివారం ముగిసాయి.ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ బల్వీందర్‌సింగ్ మాట్లాడుతూ, అధికారం కోసం కార్పొరేట్ సంస్థల నిధులతో చట్టసభల సభ్యులను కొనుగోలు చేయడం బాధాకరమన్నారు. దేశంలో రాజకీయ పార్టీలు, కార్పొరేట్ సంస్థలు కలిసి నడుస్తున్న తీరును ప్రజలు అర్ధం చేసుకొని, వాటి పర్యవసానాలను గమనించాలన్నారు. పంజాబ్‌లో రైతులు, మేథావులు, వివిధ వర్గాల ప్రజలతో నడిచిన రైతు ఉద్యమాలను స్పూర్తిగా తీసుకోవాలన్నారు. దేశ ప్రజల భావప్రకటన స్వేచ్చకు భంగం కలగకుండా చూడాలని ప్రభుత్వాలను కోరారు. ఐపిఇఎలో తీర్మానాలను వెల్లడించారు.
ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్ డైరక్టర్ ప్రొఫెసర్ గాలిబ్ మాట్లాడుతూ సమాజ హితానికి, ప్రణాళికల రూపకల్పనకు దోహదపడేలా రాజకీయ ఆర్ధిక శాస్త్రంపై పరిశోధనలు జరగాలని ఆకాంక్షించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎమ్) ఆర్థిక శాస్త్ర విభాగం ప్రొఫెసర్ కె.కల్యాణ్ మాట్లాడుతూ, ఆర్థిక, రాజనీతి శాస్త్రాల సమ్మిళిత ప్రభావాలను వివరించారు.కార్యక్రమంలో హైదరాబాద్ యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర విభాగం డీన్ ప్రొఫెసర్ ఆర్‌వి.రమణమూర్తి, సమావేశాల కన్వీనర్ డాక్టర్ ధనుంజయకుమార్, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ డైరక్టర్ ప్రొఫెసర్ బి.నళిని పాల్గొన్నారు.










