Nov 04,2020 07:05

     మ్మూ కాశ్మీర్‌లో రూపుదిద్దుకున్న 'గుప్కర్‌ డిక్లరేషన్‌ ఫర్‌ పీపుల్స్‌ అలయెన్స్‌' (పిఎజిడి) ప్రజాస్వామ్య రాజకీయాలకు, ఆ రాష్ట్ర ప్రజల ప్రజా స్వామ్య, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు, భవిష్య త్తులో జరిపే పోరాటాలకు శుభసూచికంగా వుంది.
            గుప్కర్‌ రోడ్‌ లోని ఫరూక్‌ అబ్దుల్లా నివాసంలో 2019 ఆగస్టు 4న ఆరు పార్టీలు సమావేశమై మొదటగా చేసిన ప్రకటనకు 'గుప్కర్‌ డిక్లరేషన్‌' అని పేరు పెట్టారు. జమ్మూ కాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి, 370వ అధికరణ, 35ఎ అధికరణల పరిరక్షణపై ఈ ప్రకటన చేశారు. ఆ మరుసటి రోజే (ఆగస్టు 5న), మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో 370, 35ఎ అధికరణలను దెబ్బ తీయడానికి, జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది.
జమ్మూ కాశ్మీర్‌ రాజ్యాంగ హోదాపై ఈ దారుణమైన దాడితో పాటుగా పెద్ద సంఖ్యలో అన్ని రాజకీయ పార్టీల నేతలను, కార్యకర్తలను అరెస్టు చేశారు. కేవలం బిజెపి, దాన్ని పట్టుకుని వేలాడే మరికొంత మందిని తప్ప మిగిలిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మొత్తంగా ప్రజలపై, వారి మౌలిక హక్కులపై అత్యంత దుర్భరమైన రీతిలో లాక్‌డౌన్‌ విధించారు. ఈ ఏడాది ఆగస్టు 22న మెహబూబా ముఫ్తీని మినహా మిగిలిన ప్రధాన రాజకీయ పార్టీల నేతలను విడుదల చేశారు. అనంతరం గుప్కర్‌ గ్రూపు రెండో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పిడిపి, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌, ఐఎన్‌సి, సిపిఐ(ఎం)లు మొదటి గుప్కర్‌ ప్రకటనకు కట్టుబడి వుంటామని తీర్మానిస్తూ ప్రకటన చేశారు. ''రాజ్యాంగంలో హామీ ఇవ్వబడిన విధంగా జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను పునరుద్ధరించేందుకు, ఎప్పటికప్పుడు ఇస్తున్న హామీలను నెరవేర్చేలా సమిష్టిగా పోరాటం జరుపుతామని మేం పునరుద్ఘాటిస్తున్నాం.'' అని వారు ఆ సమావేశంలో ప్రకటించారు.
          రాష్ట్రాన్ని విభజించడం తమకు ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని వారు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రతిపత్తి, ప్రజల హక్కుల పరిరక్షణకు కట్టుబడిన శక్తుల పున:పొ ందికలో 'గుప్కర్‌ డిక్లరేషన్‌-2' తొలి అడుగు.
పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీని విడుదల చేసిన తర్వాత అక్టోబరు 15న మరోసారి గుప్కర్‌ గ్రూపు సమావేశమైంది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పిడిపి, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌, అవామీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్‌ మూవ్‌మెంట్‌, సిపిఐ(ఎం)తో కూడిన ఆరు పార్టీలు ఒక కూటమి ( అలయెన్స్‌ ) ని ఏర్పాటు చేశాయి. సిపిఐ కూడా అలయెన్స్‌లో చేరింది. మరికొన్ని ఇతర పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. అక్టోబరు 24న తిరిగి ఏడు పార్టీలు మరోసారి సమావేశమయ్యాయి. అలయెన్స్‌ ఆఫీసు బేరర్లను ప్రకటించాయి.
          ఆగస్టు 22న జరిగిన సమావేశానికి హాజరైన కాంగ్రెస్‌ పార్టీ పిసిసి అధ్యక్షుడు తర్వాత జరిగిన రెండు సమావేశాలకు హాజరు కాలేదు. 370వ అధికరణను రద్దు చేసిన తీరును మాత్రమే వ్యతిరేకిం చాలని, తిరిగి దాని పునరుద్ధరణకై పోరాడరాదన్న వైఖరిని జాతీయ స్థాయిలోని కాంగ్రెస్‌ నాయకత్వం తీసుకుంది. 370వ అధికరణను పునరుద్ధరించాలని కోరుతున్న వారిపై ఇటీవల బీహార్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ తీవ్రంగా ధ్వజమెత్తిన నేపథ్యంలో ఇటీవలనే కాంగ్రెస్‌ ప్రతినిధి తమ వైఖరిని పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌ కాంగ్రెస్‌ తీరు పైరకంగా వుండడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
భారత యూనియన్‌లో జమ్మూ కాశ్మీర్‌ను చేర్చేందుకు షేక్‌ అబ్దుల్లా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేతలతో చర్చలు జరిపింది జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ పటేల్‌ అన్న విషయం కాంగ్రెస్‌ విస్మరించరాదు. ఆనాటి వారి చర్చల ఫలితంగానే రాజ్యాంగంలో 370వ అధికరణను రూపొందించారు. భారతదేశం లౌకిక స్వభావాన్ని నిరూపించేలా జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇస్తూ ఆ ప్రాతిపదికన భారత యూనియన్‌ లోకి జమ్మూ కాశ్మీర్‌ సజావుగా, సాఫీగా విలీనమయ్యేలా నెహ్రూ చర్యలు తీసుకున్నారు. ఈ లౌకికవాద వారసత్వంపై కాంగ్రెస్‌ ఏ విధంగానూ రాజీ పడరాదు. నూతన రాజకీయ కూటమి రెండు ప్రధాన ప్రత్యర్ధి పార్టీలైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పిడిపి లను ఒక తాటి పైకి తీసుకు వచ్చింది. అయితే, ప్రజల గుర్తిం పుపై, హక్కులపై నిరంతరంగా కొనసాగుతు న్న దాడులను ఎదుర్కొనేందుకు జమ్మూ కాశ్మీర్‌ లోని ప్రజాస్వామ్య, లౌకికవాద శక్తుల విస్తృత ఐక్యత అవసరం.
కేంద్ర పాలిత ప్రాంతానికి వెలుపల వున్న వారు కూడా కేంద్ర పాలిత ప్రాంతంలో భూమి కొనుగోలు చేసేలా భూ చట్టాల్లో మార్పు తీసుకువస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో అయితే ఆ రాష్ట్ర శాశ్వత నివాసులు మాత్రమే ఇలా భూములు కొనుగోలు చేయడానికి అవకాశం వుండేది. నివాస చట్టాన్ని (డొమిసైల్‌ లా) ఉల్లంఘించేలా ఈ చర్య వుంది. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర భూ, వనరులను దోపిడి చేసేందుకు ఇదొక బహిరంగ ఆహ్వానమే, పైగా జనాభాలో మార్పు క్రమాన్ని ప్రోత్సహించడమే.
           రాజ్యాంగ పరిధిలో స్వయంప్రతిపత్తిని పునరుద్ధరించేందుకు, జమ్మూ కాశ్మీర్‌ ప్రజల హక్కులను పరిరక్షించేందుకు జరిపే పోరులో 'పీపుల్స్‌ అలయెన్స్‌' ముందు చాలా క్లిష్టతరమైన కర్తవ్యం వుంది. ఆ రీతిలో పోరు సల్పాలంటే, భారత పౌరుల మౌలిక సౌకర్యాలైన ప్రజాతంత్ర రాజకీయాలు, ప్రజాస్వామ్య హక్కులను పునరుద్ధరించేందుకు మొదటగా పోరాడాల్సి వుంది. పైగా ఇది కేవలం కాశ్మీర్‌ లోయకి మాత్రమే పరిమితమైన అలయెన్స్‌ అనే భావనను 'పీపుల్స్‌ అలయన్స్‌' తరిమికొట్టాలి. రాజకీయంగా ప్రజాస్వామ్య శక్తులన్నింటినీ దగ్గరకు చేర్చుకోవాలి. జమ్మూ, లడఖ్‌ లో ప్రజాభిప్రాయాన్ని సమీకరించి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమి విచ్ఛిన్నకర రాజకీయాలను తిప్పికొట్టేలా ఉమ్మడి నిబంధనావళిని రూపొందించాలి.
            దేశంలోని అన్ని ప్రజాస్వామ్య లౌకిక శక్తుల మద్దతును, తోడ్పాటును 'పీపుల్స్‌ అలయెన్స్‌' పొందాల్సి వుంది. జమ్మూ కాశ్మీర్‌ ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రతిపత్తిలపై దాడిని ఫెడరలిజంపై జరుగుతున్న విస్తృత దాడిగానే చూడాలి. బిజెపి ప్రభుత్వ ఈ కేంద్రీకరణ చర్య అన్ని ఫెడరల్‌ నిబంధనలను, రాష్ట్రాల హక్కులను తొక్కేస్తోంది. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా రాష్ట్రాలకు చెందిన అంశాల్లో కేంద్రం జొరబడడం అంటే ఇటీవల మనం వ్యవసాయ బిల్లుల్లో చూసిన తీరుగానీ లేదా జిఎస్‌టి నష్టపరిహారం బకాయిలపై ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకోవడం వంటివి ఫెడరల్‌ వ్యతిరేక లక్షణాలుగానే భావించాల్సి వుంటుంది. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఫెడరల్‌ వాదాన్ని పరిరక్షించేందుకు మొత్తంగా జరుగుతున్న పోరాటంలో భాగంగానే 'పీపుల్స్‌ అలయెన్స్‌' కార్యకలాపాలను చూడాల్సి వుంది.
            ఇక 'పీపుల్స్‌ అలయెన్స్‌'పై బిజెపి తన మూస తరహా లోనే దాడులకు దిగుతోంది. ఇది జాతి వ్యతిరేకమని, పాకిస్తాన్‌ తరపున పనిచేసేదని విమర్శలు గుప్పిస్తోంది. కానీ, మోడీ ప్రభుత్వం మౌలిక వాస్తవికతలను గ్రహించాల్సి వుంది. దారుణమైన అణచివేత జరిగిన ఏడాది తర్వాత ప్రజల్లో ముఖ్యంగా కాశ్మీరు లోయ లోని ప్రజల్లో ఒంటరివారమనే భావన గతంలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకుంది. పూర్వపు రాష్ట్రంలోని అన్ని పక్షాలతో తక్షణమే కేంద్రం చర్చలు ప్రారంభించకపోతే ఇక ముందుకెళ్ళడానికి ప్రజాస్వామ్య మార్గమనేదే వుండదని స్పష్టం చేసింది. అయితే, మోడీ ప్రభుత్వం, బిజెపి మరింత కఠినతరమైన భద్రత, శాంతి భద్రతల వైఖరిని అనుసరించినా జమ్మూ కాశ్మీర్‌ సమస్యను కేవలం రాజకీయంగానే ఎదుర్కొనాలనే మౌలిక వాస్తవాన్ని వారు విస్మరించరాదు. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో లాహోర్‌కు ప్రధాని బస్సు పర్యటనతో సహా చర్చలకు రాజకీయ ప్రయత్నాలు జరిగాయి. అప్పటి హోం మంత్రి ఎల్‌.కె.అద్వానీ 'హిజ్బుల్‌ ముజాహిదీన్‌' ప్రతినిధులతో సహా తీవ్రవాద గ్రూపులతో చర్చలు జరిపారు.
             కాశ్మీర్‌ లోని ప్రధాన స్రవంతిలో గల రాజకీయ పార్టీలతో చర్చలు జరపడానికి మోడీ ప్రభుత్వం సుముఖంగా లేకపోతే అత్యంత సంక్లిష్టమైన ఈ సమస్య పరిష్కారంలో ఎలాంటి పురోగతి వుండదు. పైగా ఈ సమస్య, దేశ ఫెడరల్‌, ప్రజాస్వామ్య, లౌకికవాద రాజకీయాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తునే వుంటుంది.


('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం )