
ప్రజాసంకల్ప యాత్ర చారిత్రాత్మకం
ప్రజాశక్తి-మర్రిపాడు : ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజాసంకల్ప పాదయాత్ర చారిత్రాత్మకమని, పాదయాత్ర పూర్తయి ఆరు సంవత్సరాలు పూర్తయినా ఇంకా ప్రజల గుండెల్లో అలాగే నిలిచిపోయిందని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. మండలంలోని బ్రా హ్మణపల్లిలో ఆయన నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు నిర్వహించిన ప్రజాసంకల్ప పాదయాత్ర పూర్తయి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరీ సమస్యలు తెలుసుకోవాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరిని స్వయంగా కలవాలని సంకల్పించి ముఖ్యమంత్రి 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలందరూ నమ్మి ఆయనను ముఖ్యమంత్రిని చేసుకున్నారని, అధికారంలోకి వచ్చాక నవరత్నాల పథకాలతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని తెలిపారు. తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగా పేదవాడి గుండెల్లో బతకాలన్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆశయమే ప్రజల సంక్షేమానికి దారి చూపిస్తుందన్నారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా కోట్లాది రూపాయలను ప్రజలకు నేరుగా అందజేసి వారిని ఆర్థికంగా ఆదుకున్నారని తెలిపారు. పేదలందరినీ ఏకం చేసే వేదికగా సామాజిక సాధికార యాత్ర జరుగుతుందని, ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనారిటీలకు వైసిపి ప్రభుత్వం చేసిన మంచిని వివరిస్తూ సాగుతున్న ఈ యాత్ర త్వరలోనే ఆత్మకూరు నియోజకవర్గానికి చేరుకుంటుందన్నారు. నియోజకవర్గ ప్రజలు సామాజిక సాధికార బస్సు యాత్రల్లో వేలాదిగా పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పాలన కొనసాగేలా చేసుకుందామన్నారు. కార్యక్రమంలో పలువురు వైసిపి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.