ప్రజాశక్తి-గుంతకల్లు : రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి జైలు, బెయిలు రాజకీయాలతో కాలం గడిపేస్తున్నారని సిపిఎం రాష్ట్ర నాయకులు జి.ఓబులు విమర్శించారు. వెనుకబడిన అనంతపురం జిల్లా సమగ్రాభివృద్ధి కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ భేరి స్కూటర్‌యాత్ర మంగళవారం 2వ రోజు పలు మండలాల్లో కొనసాగింది. గుత్తిలో ప్రారంభం అయిన యాత్ర గుంతకల్లు మీదుగా వజ్రకరూరు, ఉరవకొండ, విడపనకల్లు, కణేకల్లు, రాయదుర్గం, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం, శెట్టూరు మీదుగా రాత్రికి కుందుర్పి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో నాయకులు ప్రసంగించారు. గుతంతకల్లు పొట్టి శ్రీరాములు కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఓబులు మాట్లాడుతూ వెనుకబడిన అనంతపురం జిల్లా అభివృద్ధికి పాలకులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. జిల్లాకు ఉన్న ఏకైక సాగునీటి వనరు తుంగభద్ర హెచ్‌ఎల్‌ఎసి కాలువ కింద నిర్ణయించిన ఆయకట్టు భూములకు ఇప్పటి వరకూ ఏనాడు పూర్తిస్థాయిలో నీరు అందించిందిలేదన్నారు. పది మందికి ఉపాధి చూపే ఒక్క పరిశ్రమ కూడా వైసిపి ప్రభుత్వం జిల్లాలో నెలకొల్పలేదని అన్నారు. గుంతకల్లు పట్టణంలో మూతపడిన స్పిన్నిగ్ మిల్లులో ప్రత్యామ్నాయ పరిశ్రమలు ఏర్పాటు చేయడంలోనూ ప్రభుత్వం విఫలం అయిందన్నారు. రైల్వే జోన్ ఏర్పాటుకు అన్ని అర్హతలున్న గుంతకల్లు రైల్వే డివిజన్‌ను బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. మున్సిపాల్టీలో పారిశుధ్య కార్మికల సంఖ్యను పెంచి ప్రజా ఆరోగ్యాలు కాపాడాలన్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నాగసముద్రం వరకు పిల్ల కాలువలను ఏర్పాటు చేసి సాగు నీరు అందించి రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 15న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గుత్తిలో జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లాకు గత 15 సంవత్సరాలుగా హంద్రీనీవా నీరు వస్తున్నా ఆయకట్టుకు నీరు ఇవ్వలేదన్నారు. వెయ్యి మందికి ఉపాధి చూపే ఒక్క పరిశ్రమ కూడా జిల్లాలో లేదన్నారు. గ్రామాల్లో వరుస కరువులతో వ్యవసాయ కూలీలు వలసల్లోనే జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వజ్రకరూరు, ఉరవకొండ మండలాల్లో జరిగిన కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లక్ష ఎకరాలకు సాగు నీరు ఇస్తామని హామీని ఇచ్చిన వైసిపి నాయకులు దానిని నిలబెట్టుకోలేక పోయారని విమర్శించారు. కరువుతో సతమతం అవుతున్న ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాలరంగయ్య, నాయకులు వి.నిర్మల, డి.శ్రీనివాసులు, బి.శ్రీనివాసులు, రంగారెడ్డి, దాసరి శ్రీనివాసులు, మారుతి ప్రసాద్,కసాపురం రమేష్, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, గుత్తి సిపిఎం మండల కార్యదర్శి రామక్రిష్ణ, ఉరవకొండ, వజ్రకరూర్ మండలాల కార్యదర్శులు మధుసూదన్, విరుపాక్షితో పాటు అన్ని మండలాల సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.