
ప్రజాశక్తి - రేపల్లె
ప్రజాసమస్యలు పరిష్కారం లక్ష్యంగా సిపిఎం బస్సు యాత్ర చేస్తున్నట్లు సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ తెలిపారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఎం ఆధ్వర్యంలో అక్టోబరు 29నుంచి నవంబర్ 8వరకు రాష్ట్రంలో ప్రధాన సమస్యల పరిష్కారం కోరుతూ ప్రచారయాత్ర జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు బస్సుయాత్ర బృందాలు పర్యటిస్తున్నట్లు తెలిపారు. అక్టోబరు 29కర్నూలు జిల్లా నుంచి బయలు దేరి నవంబర్ 7న బాపట్ల జిల్లాకి వస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్త సమస్యలుతో పాటు రేపల్లె పట్టణంలోని సమస్యలను తెలియజేయాలని కోరారు. రెండు రోజులపాటు జిల్లాలో సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్రలు ద్వార ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు బిజెపితో అంట కాగుతూ ప్రజా సమస్యలను పక్కన పెడుతున్నరని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సిపిఎం నిర్వహించే యాత్రలు ప్రజలోకి వెళ్లాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వృత్తిదారులు, సామాజిక సమస్యలు, కార్మిక, విద్యార్థి, నిరుద్యోగ సమస్యలు పరిష్కారం కోసం యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సిపిఎం నాయకులు కెవి లక్ష్మణరావు, జె ధర్మరాజు, డి శ్రీనివాస్, కె ఆశ్విరాధం పాల్గొన్నారు.