పుట్టపర్తి రూరల్ : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్, జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్ తెలిపారు. శనివారం నాయుడు సిపిఎం జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆగస్టు 30 నుంచి సెప్టంబర్ 4వ తేదీ వరకు నిర్వహించిన వివిధ ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి పాలన సాగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారాలను వేస్తూ ప్రజల నడ్డివిరుస్తున్నారన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచి ఎడాపెడా భారాలు వేస్తున్నారన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను ఇవ్వకుండా రైతులను ఇబ్బందుల పాలుజేస్తున్నారన్నారు. వర్షాలు లేక జిల్లాలో పంటలు సాగు జరగలేదన్నారు. సాగు చేసిన అరకొర పంటలు వర్షాభావంతో ఎండిపోతున్నాయని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్ట పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. సత్యసాయి వాటర్ వర్కర్స్ సమస్యలను కూడా వెంటనే పరిష్కరించి వారి సమ్మెను విరమింపజేసలా ప్రభుత్వం, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. ఆగస్టు 30, 31న ప్రజలతో సంతకాల సేకరణ, సెప్టెంబర్ 1న సచివాలయాల అధికారులకు అర్జీల అందజేత, సెప్టెంబర్ 4న మండల కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ నాయకులు ఇఎస్.వెంకటేష్, జిఎల్.నరసింహులు, ఫిరంగి ప్రవీణ్ కుమార్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.










