ప్రజాశక్తి - కలిదిండి
అత్యధిక తలసరి ఆదాయం కలిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్లాది రూపాయాల ఆదాయాన్ని సమకూరుస్తున్న కలిదిండి మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం శోచనీయమని సిపిఎం నేతలు పేర్కొన్నారు. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కారానికి పెదలంక నుండి కలిదిండి వరకూ పాదయాత్ర సోమవారం సాగింది. ఈ పాదయాత్రను సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి జెండా ఊపి ప్రారంభించారు. పాదయాత్రకు గ్రామ గ్రామాన ఆటో, బిల్డింగ్ వర్కర్స్, సిఐటియు, టిడిపి, మహాసేన, బేడ, బుడగ జంగం నాయకులు ఘనస్వాగతం పలుకుతూ తమ సంఘభావాన్ని తెలిపారు. పెదలంక, మూలలంక, భాస్కరరావు పేట, సంతోషపురం, గుర్వాయిపాలెం, కలిదిండి గ్రామాల్లో జరిగిన బహిరంగ సభల్లో రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.రామకృష్ణ, డిఎన్‌విడి.ప్రసాద్, మండల కార్యదర్శి ఎస్.మహంకాళిరావు మాట్లాడారు. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన మండలంగా, 90 శాతం ఆక్వా సాగుతో ఉండి, సెజ్ రూపంలో, విదేశీ మారక ద్రవ్యం రూపంలోనూ వందల కోట్ల రూపాయలు ప్రభుత్వాలకు వస్తుందన్నారు. కానీ మండల ప్రజలకు సరైన తాగునీరు అందించడం గానీ, గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేయకపోవడం శోచనీయమన్నారు. పలుగ్రామాల్లో ఇరిగేషన్ భూముల్లో ఇంటి పన్ను, విద్యుత్, కుళాయి ఛార్జీలు చెల్లిస్తూ తరతరాలుగా వెయ్యి కుటుంబాలకుపైగా నివాసముంటున్న వారికి నేటికీ పట్టాలు ఇవ్వక పోవడం దారుణమన్నారు. ఎన్నికల ముందు స్థానిక ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. ఆక్వా జోన్‌గా ప్రకటించారే గానీ, సరైన తాగునీరు అందించడంలో విఫలమయ్యారన్నారు. ఈ జోన్ పరిధిలో ప్రజలు అత్యధికంగా కేన్సర్, కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. శుద్ది చేసిన తాగునీరు అందించాలని, అర్హులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, జగనన్న కాలనీల్లో ప్రభుత్వమే ఇళ్లు కట్టివ్వాలని, కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే పలు డిమాండ్లతో వినతి పత్రాన్ని తహశీల్దార్ వంశీకి అందజేశారు. సిపిఎం మండల కమిటీ సభ్యులు వీరవల్లి భాస్కరరావు, అద్దాని వెంకటేశ్వరరావు, చిప్పాడ దుర్గాప్రసాద్ దొర, జక్కుల మహేష్, చిన్నం శ్రీకాంత్, వెంకమ్మ, బుస్సా శివలీల, వీరవల్లి వరలక్ష్మి, ఎస్.మహాలక్ష్మీ, టిడిపి బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి అండ్రాజు శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస చక్రవర్తి, మహాసేన నియోజక వర్గ అద్యక్షులు చాబత్తిన రాజు, బెడ బుడగ జంగాల సంఘం రాష్ట్ర కోశాధికారి బైలపాటి నాగ శ్రీనివాసరావు పాల్గొన్నారు.










