కార్యాలయాన్ని ముట్టడిస్తున్న నాయకులు
సిపిఎం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో
ప్రజాసమస్యల పరిష్కారానికై కార్పొరేషన్ ముట్టడి
ప్రజాశక్తి-నెల్లూరు :ఈ నెల 2వ తేది నుంచి 7వ తేది వరకు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 26 డివిజన్లలో సిపిఎం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా పోరు యాత్రలో ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికై కార్పోరేషన్ కార్యాలయం ముట్టడి నిర్వహిస్తున్నట్లు సిపిఎం రూరల్ కార్యదర్శి బత్తల కృష్ణయ్య పేర్కొన్నారు. బుధవారం సిపిఎం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో బారాషాహిద్ దర్గా ప్రాంతం నుంచి కార్పోరేషన్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కార్పోరేషన్ కార్యలయం లోపలికి వెళ్తున్న ప్రజలను, సిపిఎం కార్యకర్తలను అడ్డుకొనేందుకు పోలీసులు ప్రయత్నించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పోరేషన్ కార్యాలయ ముట్టడి నిర్వహిస్తున్నామని, పోలీసులు సహకరించకపోతే కార్యాలయంలోకి వెళ్తామని సిపిఎం నాయకులు ప్రకటించారు. చివరకు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట భైటాయించి నినాదాలు చేపట్టారు. కమిషనర్ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారని, నినాదాలు చేయవద్దని పోలీసులు వారించారు. తాము తమ సొంత పనుల కోసం రాలేదని, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలని కోరేందుకు మాత్రమే తాము వచ్చామని, అధికారులు వస్తే వినతిపత్రం అందజేసి వెనుదిరిగి వెళ్తామని పోలీసులకు సమాదానం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న కమిషనర్ వికాస్‌మర్మత్ బయటకు వచ్చి సమస్యలుంటే పూర్తి ఆధారాలతో తనకు అందజేస్తే వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని తెలియజేసి సిపిఎం నాయకులు అందజేసిన వినతిపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు , మాజీ డిప్యూటి మేయర్ మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సిపిఎం ఆధ్వర్యంలో నగర సమగ్రాభివృద్ది కోసం రూరల్ ,నగర నియోజకవర్గ పరిధిలోని 54 డివిజన్లలో ప్రజా సమస్యలను గుర్తించేందుకు ఆగష్టు 2వ తేది నుంచి 15వ తేది వరకు ప్రజా పోరు యాత్ర నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గ పరిధిలో ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఎం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో కార్పోరేషన్ కార్యాలయ ముట్టడి కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రధానంగా నగరంలో విషజ్వరాలు ప్రబలతున్నాయన్నారు. మంచి నీటి కాలుష్యం వల్ల , పారిశుద్ద్య లోపం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైనట్లు ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. రూరల్ నియోజకవర్గ పరిధిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కోసం గత ప్రభుత్వ హాయంలో దాదాపుగా రూ.600 కోట్లు ఖర్చు చేసి పనులు ప్రారంభించారన్నారు. ఈ పనులు దాదాపుగా 80 శాతం పూర్తయినాయన్నారు. మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేసి ఆ డ్రైనేజీ వ్యవస్థను వినియోగంలోకి ఈ ప్రభుత్వం తీసుకొచ్చి ఉంటే నగరంలో ఇటువంటి పరిస్థితి వచ్చిఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అదే విధంగా రూ.550 కోట్లు ప్రజాధనం ఖర్చుచేసి మంచినీటి సరఫరా పనులు ప్రారంభించారని, ఆ పనులు 80 శాతానికి పైగా పూర్తి అయినప్పటికీ అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం వాటిని పూర్తి చేయకపోవడంతో ప్రస్తుతం ఆ పనుల నిర్వహణకు ఖర్చులు రెట్టింపు అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే కమిషనర్ స్పందించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి భుగర్భ డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని కోరారు. నిరుపేదల సొంత ఇంటి కలను నిజం చేయాలన్న ఆలోచనతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వేలాది టిడ్కో ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వం పూర్తి చేసినప్పటికీ ఈ ప్రభుత్వం కేవలం 1700ఇళ్లను మంత్రమే లబ్దిదారులకు అందజేసిందన్నారు. మిగిలిన ఇళ్లు ను అర్హత కలిగిన లబ్దిదారులందరికీ అందజేయాలని డిమాండ్ చేశారు. ఇక జగనన్న ఇళ్ల నిర్మాణాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయాలన్నారు. ఇంకా ఇళ్ల స్థలాలు లేని అనేక మంది నిరుపేదలు ఉన్నారని, వారందరికీ ప్రభుత్వం జగనన్న ఇళ్ల కేటాయింపు చేయాలన్నారు. నగరంలో రహదారులన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయని, వాటన్నింటికి మరమ్మత్తుల చేయాలన్నారు. మహిళల ఆర్ధికాభివృద్దిని ఆకాంక్షిస్తూ స్వయం సహాయ సంఘాలు ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేసి ప్రోత్సహిస్తుంటే ప్రస్తుతం ఆ వ్యవస్థ అంతా అవినీతితో నిండిపోయిందన్నారు. లబ్దిదారులకు రుణాలు మంజూరు అయి నగదు అందజేయాలంటే కమిషన్లు అందజేయల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితిని కమిషనర్ చక్కదిద్దాలన్నారు.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం తదితర ప్రాంతాల నుంచి అనేక మంది నిరుద్యోగులు తమ జీవనోపాది కోసం పొట్టచేతపట్టుకొని రూరల్ నియోజకవర్గంలో ఉన్నారని, వీరందరూ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని, ఇటువంటి వారందరికీ పట్టణ ఉపాధి హామీ పథకంలో ఏడాదిలో 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. రూరల్ నియోజకవర్గం పరిధిలో ఆగష్టు 2వ తేది నుంచి7 వ తేది వరకు కార్పోరేషన్ పరిధిలోని 26 డివిజన్లలో ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రజా పోరు యాత్ర నిర్వహించామని సిపిఎం రూరల్ కార్యదర్శి బత్తల కృష్ణయ్య అన్నారు. ఈ పాదయాత్రల నిర్వహిస్తున్న సమయంలో ప్రజలు అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారని, ఆయా సమస్యలను పరిష్కరించాలని కార్పోరేషన్ కార్యాలయ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కమిషనర్ సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆయనడిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్ కార్యదర్శి వర్గ సభ్యులు కిన్నెర కుమార్, కొండా ప్రసాద్, ఎండి అబ్దుల్ అజీజ్, రూరల్ కమిటీ సభ్యులు వీర్ల శ్రీనివాసులు, డి.సంపత్‌కుమార్, ఎన్. మాలకొండయ్య, ఎస్‌కె.షాహీనాబేగం, ఎస్‌కె షంషాద్, ఎస్‌కె రుబియా, ఎస్‌డి రఫి అహ్మద్, శాఖా కార్యదర్శులు ఎం.సుధాకర్, కట్టా సతీష్, వై.ఈశ్వరయ్య, ఒ. సుధీర్, ఎండి.అమిత్‌జాన్, ఎస్‌కె. అహ్మద్, ఎస్‌కె షాన్వాజ్, వెంకి, శ్యాంసన్ తదితరులు పాల్గొన్నారు.










